ప్రభుత్వ టీచర్లకు బిగ్ అలర్ట్.. నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్?

by Gantepaka Srikanth |

ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తప్పకుండా టెట్ క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇప్పుడు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.

ప్రభుత్వ టీచర్లకు బిగ్ అలర్ట్.. నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తప్పకుండా టెట్ క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇప్పుడు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. బోధనతో పాటు టెట్ సిలబస్‌ను కవర్ చేసేందుకు వీరంతా అదనపు సమయాన్ని కేటాయిస్తున్నారు. టెట్‌లో క్వాలిఫై అవ్వాలనే నిబంధన వీరిపై మరింత ఒత్తిడిని పెంచింది. నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో క్వాలిఫై అయిన వారికే పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు ఉంటాయనే నిబంధనతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లందరూ పరీక్షకు సిద్ధమవుతున్నారు.

2010 కంటే ముందు రిక్రూట్ అయిన వారికి మినహాయింపు

2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిబంధనలను రూపొందించిన ఉత్తర్వుల్లో 2010 నాటికి ముందు నియమితులైన వారికి టెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ కారణంగానే 15 సంవత్సరాలుగా ఉపాధ్యాయులు టెట్ రాసే ఆలోచన చేయలేదు. 2010 ఆగస్టు 23 తర్వాత నియమితులైన టీచర్లకు మాత్రమే టెట్ తప్పనిసరి చేయాలని, అంతకు ముందు నియమితులైన వారికి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో 1.10 లక్షల మంది టీచర్లు ఉండగా వారిలో 30 వేల మంది రెండేళ్లలోపు టెట్ రాయాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ గడువులోపు టెట్ పాస్ కాకుంటే వారు ఉద్యోగం వదులుకోవాల్సి ఉంటుందని, అలాంటి వారిని ఉద్యోగ విరమణ చేయించి సంబంధిత బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాలను న్యాయస్థానం ఆదేశించింది. ఒక వేళ 2009 తర్వాత నియమితులై, ఉద్యోగ విరమణకు ఐదేళ్లలోపు సర్వీస్ ఉంటే వారికి టెట్ అవసరం లేదు. వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాల్సిందే. 2009 తర్వాత పదోన్నతి పొందిన వారు టెట్ పేపర్ - 2కు ఉత్తీర్ణులు కావాలా.. లేదా.. అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్లు

సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం సైతం రివ్యూ పిటిషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలన్నా.. ఐదు సంవత్సరాలకు తక్కువ సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలన్నా టెట్‌లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వ పాఠశాలలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 15 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏది ఏమైనా టెట్ ఖచ్చితంగా పాస్ కావాలనే షరతు వల్ల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఉద్యో్గ సంఘాల నేతలు చెబుతున్నారు.

Next Story