ముగిసిన టెట్ పరీక్షలు.. 82.09 శాతం హాజరు, ఫలితాలు ఎప్పుడంటే?

by Ramesh Naini |

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీటెట్-2026) కంప్యూటర్ ఆధారిత పరీక్షలు విజయవంతంగా ముగిశాయి.

ముగిసిన టెట్ పరీక్షలు.. 82.09 శాతం హాజరు, ఫలితాలు ఎప్పుడంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీటెట్-2026) కంప్యూటర్ ఆధారిత పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. టెట్ పేపర్ 1, 2 లకు కలిపి మొత్తం 2.37 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు మంగళవారం నాటికి మొత్తం 15 సెషన్లలో పూర్తయ్యాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,95,181 (82.09 శాతం) మంది హాజరయ్యారని, 42,573 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పేపర్ 1 పరీక్షకు మొత్తం 85,538 మందికి గాను 71,198 మంది (83.24 శాతం) హాజరయ్యారు. పేపర్ 2 (మ్యాథ్స్ అండ్ సైన్స్) 86,413 మందికి గాను 69,861 మంది (80.85 శాతం) హాజరయ్యారు. పేపర్ 2 (సోషల్ స్టడీస్) పరీక్షకు 65,803 మందికి గాను 54,122 మంది (82.25 శాతం) హాజరయ్యారు. ఈ పరీక్షకు హాజరైన వారిలో ఇన్ సర్వీస్ టీచర్లు 90.27 శాతం మంది ఉండగా, ఇతర అభ్యర్థులు 78.49 శాతం మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. వచ్చే నెల మొదటి వారంలో పరీక్షల ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం తెలుస్తోంది.

30 నుండి అభ్యంతరాల స్వీకరణ..

టీజీ టెట్ ప్రాథమిక కీ ని జనవరి 30న అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ సమాధానాలను సరిచూసుకోవడానికి https://www.schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఒకవేళ ప్రాథమిక కీ పై ఏదైనా అభ్యంతరాలు ఉంటే, అభ్యర్థులు జనవరి 30 నుండి ఫిబ్రవరి1 వరకు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించనున్నారు.

Next Story