- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్‌కు పరీక్ష.. NDMA ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మాక్ ఎక్సర్‌సైజ్
తెలంగాణలో అకస్మాత్తుగా వచ్చే వరదలు, పారిశ్రామిక ప్రమాదాలు మరియు అడవుల్లో కార్చిచ్చును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎన్డీఎంఏ (NDMA) సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అకస్మాత్తుగా భారీ వరదలు వచ్చినా, అడవుల్లో కార్చిచ్చు రేగినా, లేదా పారిశ్రామిక వాడల్లో ప్రమాదాలు జరిగినా తక్షణమే స్పందించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు మరియు విపత్తులను దీటుగా ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) సహకారంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహించారు. విపత్తు వేళ వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్‌ను పకడ్బందీగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు చేపట్టారు.
వరద ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్..
వరద ప్రభావిత ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఖమ్మం, వరంగల్, కామారెడ్డి, నిజామాబాద్, జోగులాంబ గద్వాల, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట, ములుగు, వనపర్తి, హనుమకొండ జిల్లాల్లో ప్రధానంగా ఈ మాక్ డ్రిల్స్ చేపట్టారు. విపత్తు సమయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం, ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ పనితీరు, కమ్యూనికేషన్ వ్యవస్థల లభ్యతను క్షేత్రస్థాయిలో పరీక్షించారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించడంపై ముందస్తు కసరత్తు చేశారు. ఈ విన్యాసాల ద్వారా మానవ వనరులు, లాజిస్టిక్స్‌లో ఉన్న చిన్నచిన్న లోపాలను గుర్తించి, వాటిని ఎలా అధిగమించాలో అధికారులు విశ్లేషించారు.
రసాయన లీకేజీలు, అగ్నిప్రమాదాలపై ప్రత్యేక నిఘా..
పారిశ్రామిక ప్రమాదాలను ఎదుర్కొనే వ్యూహాల్లో భాగంగా సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ప్రత్యేక మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహించారు. రసాయన లీకేజీలు, అగ్నిప్రమాదాలు, విద్యుత్ అంతరాయాల సమయంలో సమీప పరిశ్రమలు పరస్పరం ఎలా సహకరించుకోవాలి? అలాగే ఫైర్, పోలీస్, వైద్య శాఖల సమన్వయం ఎలా ఉండాలనే దానిపై సిబ్బందికి స్పష్టమైన అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి పక్కా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) అవసరాన్ని ఈ విన్యాసాలు తెలియజేశాయి.
మరోవైపు, వేసవి ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం మరియు మానవ తప్పిదాల వల్ల అడవుల్లో రేగుతున్న కార్చిచ్చును అదుపు చేసేందుకు అటవీ శాఖ సహకారంతో.. కుమురం భీం ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మాక్ డ్రిల్స్ చేపట్టారు. అటవీ సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. తెలంగాణ ఫైర్, ఎమర్జెన్సీ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ డీజీ విక్రమ్ సింగ్ మాన్, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి హరిచందన దాసరి, ఎన్డీఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ సుధీర్ బహల్ పర్యవేక్షణలో ఈ మాక్ ఎక్సర్‌సైజ్‌లు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, లైన్ డిపార్ట్‌మెంట్లు, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






