- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిత్ర పరిశ్రమలో వేల కోట్ల టెర్రర్ స్కామ్.. ఎస్సై శివారెడ్డి బదిలీపై బాధితుల ఆవేదన
దక్షిణాది చిత్ర పరిశ్రమలో వేల కోట్ల రూపాయల టెర్రర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణాది చిత్ర పరిశ్రమలో వేల కోట్ల రూపాయల టెర్రర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమా రంగుల లోకంలోకి అడుగుపెట్టాలనుకునే యువతను, తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు ఆశిస్తున్న ఇన్వెస్టర్లను లక్ష్యంగా చేసుకుని ఓ భారీ మాఫియా నెట్‌వర్క్ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ కేసులో కీలక నిందితురాలు మాధవిని అరెస్టు చేసి, దర్యాప్తును వేగవంతం చేసిన గచ్చిబౌలి సబ్ ఇన్‌స్పెక్టర్ శివారెడ్డిని అకస్మాత్తుగా కేసు నుంచి తొలగించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పలుకుబడి, ధన బలంతో మాఫియా శక్తులు దర్యాప్తు అధికారిని బదిలీ చేయించాయని, దీనివల్ల గత రెండు నెలలుగా కేసులో ఎలాంటి పురోగతి లేదని బాధితుడు ఆకాశ్ వర్మ (Akash Verma) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గచ్చిబౌలి డీసీపీకి లేఖ రాస్తూ, ఎస్సై శివారెడ్డిని తిరిగి కేసు దర్యాప్తులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
నిజాయతీపై వేటు.. మాఫియా పన్నాగం..
ఎస్సై శివారెడ్డి తన నిబద్ధతతో స్కామ్‌లోని కీలక వ్యక్తి మాధవిని పట్టుకోగలిగారు. ఆమెను విచారించగా.. ఈ మోసపూరిత సంస్థ దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం విస్తరించి ఉన్నట్లు వెల్లడైంది. పోలీసుల నిఘా తమపై తీవ్రంగా ఉందని సంస్థ నాయకత్వానికి మాధవి సమాచారం అందించడంతో, అప్రమత్తమైన మాఫియా శక్తులు తమ రాజకీయ బలాన్ని ప్రయోగించి శివారెడ్డిని స్టేషన్ నుంచి, కేసు నుంచి తప్పించినట్లు బాధితులు అనుమానిస్తున్నారు. ఒకవేళ కొత్తగా వచ్చే అధికారి మాఫియాకు సహకరిస్తే.. క్రైమ్ బ్రాంచ్ డీసీపీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటుందని ఆకాశ్ వర్మ తన లేఖలో పేర్కొన్నారు.
నకిలీల ముసుగులో విధ్వంసం..
ఈ సంస్థ కేవలం ఆర్థిక మోసాలకే పరిమితం కాలేదని, దీనిని ఒక టెర్రరిస్ట్ స్కామ్ ఆర్గనైజేషన్ గా పరిగణించాలని బాధితులు కోరుతున్నారు. మైత్రీ, అన్నపూర్ణ, దిల్ రాజు వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఫిల్మ్ ఛాంబర్ల పేర్లను వాడుకుంటూ.. విజయ్ రవిశంకర్, సుప్రియ వంటి పేర్లతో నకిలీ నిర్మాతలు, నకిలీ ఛాంబర్ ప్రతినిధులుగా చలామణి అవుతూ ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. రెండేళ్లలో 4 ,5 రెట్లు లాభాలు ఇస్తామంటూ ఇన్వెస్టర్లను, వెండితెరపై అవకాశం ఇస్తామంటూ యువతీ యువకులను ట్రాప్ చేసి, వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, నెట్‌ఫ్లిక్స్‌ల పేరు చెప్పి మాఫియా శక్తులు చిత్ర పరిశ్రమలోకి చొరబడుతున్నాయని ఆరోపించారు.
అదృశ్యమవుతున్న బాధితులు..
హైటెక్ నిఘా ఈ ముఠాకు వ్యతిరేకంగా ఎవరైనా పోలీసులకు సమాచారం ఇస్తున్నట్లు అనుమానం వస్తే, వారిని అదృశ్యం చేయడం లేదా చంపేయడం వంటి నేరాలకు ఈ సంస్థ వెనుకాడడం లేదని ఆకాశ్ వర్మ దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు. వీరు అంతర్జాతీయ స్థాయి హైటెక్ సాంకేతికతను ఉపయోగిస్తూ ఈమెయిల్స్ ద్వారా సమాచారాన్ని మార్చుకుంటున్నారు. గూగుల్ వంటి సంస్థలు కూడా వీరి రికార్డులను ట్రాక్ చేయలేని విధంగా టెక్నాలజీని వాడుతున్నారని పేర్కొన్నారు.
సీఎం జోక్యం కోరుతూ విన్నపం..
ఈ భారీ అంతర్జాతీయ కుట్రను ఛేదించాలంటే ఎస్సై శివారెడ్డి వంటి నిజాయితీ గల అధికారి అవసరం ఎంతో ఉందని బాధితులు స్పష్టం చేశారు. ఎన్‌ఎస్‌ఏ చీఫ్ అజిత్ దోవల్, ఇజ్రాయెల్ వంటి అంతర్జాతీయ సహకారంతో ఈ మాఫియాను నిర్మూలించవచ్చని ఆకాశ్ వర్మ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, గచ్చిబౌలి డీసీపీలను కలిసి ఎస్సై శివారెడ్డిని తిరిగి కేసు దర్యాప్తునకు నియమించేలా ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ఈ కేసు శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, వేల కుటుంబాలు నాశనమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.






