సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ ర్యాలీకి నో పర్మిషన్.. నేతల అరెస్ట్

by Ramesh Naini |   (  Updated:2026-01-17 05:00:29  IST  )

సికింద్రాబాద్ చారిత్రక వారసత్వాన్ని కాపాడాలని, ఈ ప్రాంతాన్ని ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారత్ రాష్ట్ర సమితి (BRS) తలపెట్టిన ‘శాంతి ర్యాలీ’ ఉద్రిక్తతకు దారితీసింది.

సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ ర్యాలీకి నో పర్మిషన్.. నేతల అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ చారిత్రక వారసత్వాన్ని కాపాడాలని, ఈ ప్రాంతాన్ని ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారత్ రాష్ట్ర సమితి (BRS) తలపెట్టిన ‘శాంతి ర్యాలీ’ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో పాటు, పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు చేయడంతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

అడుగడుగునా భారీ మోహరింపు

సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం నినాదంతో బీఆర్‌ఎస్ నేడు భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ మీదుగా ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగాల్సి ఉంది. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఈ ప్రదర్శనకు అనుమతి ఇవ్వనట్లు తెలుస్తోంది. రైల్వే స్టేషన్, ప్యాట్నీ సెంటర్ల వద్ద ఇవాళ తెల్లవారుజాము నుంచే భారీగా పోలీసు బలగాలను మోహరించాయి.

హోటళ్లలోకి వెళ్లి మరీ అరెస్టులు

ర్యాలీలో పాల్గొనేందుకు నల్ల బ్యాడ్జీలతో తరలివచ్చిన బీఆర్‌ఎస్ కార్యకర్తలను, నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఆల్ఫా హోటల్‌లోకి వెళ్లిన పోలీసులు, అక్కడ ఉన్న పార్టీ శ్రేణులను పోలీస్ వ్యాన్లలో తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్‌ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీ నేపథ్యంలో పోలీసులు సికింద్రాబాద్ వైపు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానితులను విచారించి పంపుతున్నారు. అరెస్టయిన వారిని నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం.

Read More..

సికింద్రాబాద్‌ కార్పొరేషన్ కోసం BRS పోరు.. కాసేపట్లో KTR నేతృత్వంలో భారీ ర్యాలీ

Next Story