రూ.10 కోట్లు దాటితే టెండర్ కమిటీ పర్మీషన్ మస్ట్.. పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ఉత్తర్వులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-18 16:51:31  IST  )

హైడ్రా (HYDRAA) చేపట్టే చెరువుల పునరుద్ధరణ, భూముల పరిరక్షణ పనుల్లో రూ.10 కోట్లు దాటితే టెండర్ కమిటీ ఆమోదం తప్పనిసరి చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రూ.10 కోట్లు దాటితే టెండర్ కమిటీ పర్మీషన్ మస్ట్.. పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ఉత్తర్వులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా (HYDRAA) ఆధ్వర్యంలో చేపట్టే చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ భూముల పరిరక్షణ పనులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.10 కోట్ల లోపు విలువైన పనులను ఆమోదించే బాధ్యతను హైడ్రా కమిషనర్‌కు అప్పగించగా, ఆ పైన అంటే రూ.10 కోట్లకు పైబడిన పనులకు మాత్రం టెండర్ కమిటీ ఆమోదం తప్పనిసరి అని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే పబ్లిక్ హెల్త్ విభాగం ఈఎన్సీ (ENC) అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి టెండర్ కమిటీని ఏర్పాటు చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఎంఆర్‌డీసీఎల్, ఇరిగేషన్ & క్యాచ్‌మెంట్ ఏరియా డెవలప్‌మెంట్‌ శాఖల చీఫ్ ఇంజినీర్లతో పాటు హైడ్రా అకౌంట్స్ ఆఫీసర్, హైడ్రా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉంటారు.

క్యూర్' పరిధిలో వర్షాకాల అత్యవసర పనులు హైడ్రాకే..

కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ఏరియాల్లో వర్షాకాల అత్యవసర పనుల నిర్వహణ, వరద నివారణ, విపత్తుల నిర్వహణ చర్యలను హైడ్రాకు అప్పగిస్తూ పురపాలక శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ మరో ఉత్తర్వు జారీ చేశారు. వర్షాకాలంలో పట్టణ వరదల నియంత్రణ, క్యాచ్ పిట్‌లలో అడ్డంకులను తొలగించడం, నిలిచిన నీటిని తోడివేయడం మరియు ఇతర విపత్తు ప్రతిస్పందన చర్యలను చేపట్టాలని ప్రభుత్వం హైడ్రాను ఆదేశించింది.

‘గత ఏడాది (జూలై 2025 నుండి నవంబర్ 2025 వరకు) వర్షాకాలంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లు, 150 వార్డులను కవర్ చేస్తూ హైడ్రా తన అత్యవసర బృందాల (Static Teams) ద్వారా ఈ పనులను విజయవంతంగా నిర్వహించింది. రోడ్లపై పడిన చెట్లు, స్తంభాలను తొలగించడం, నాలాల భద్రతను తనిఖీ చేయడం, పూడికతీత పనులు చేపట్టడం మరియు వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు అందించడంలో హైడ్రా కీలక పాత్ర పోషించింది’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదే తరహాలో, రాబోయే వర్షాకాలంలోనూ (జూన్ 2026 నుండి నవంబర్ 2026 వరకు) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) పరిధిలో విపత్తులను తట్టుకునేలా, సమర్థవంతమైన అత్యవసర ప్రతిస్పందనను చాటేలా పనులు చేపట్టాలని ప్రభుత్వం హైడ్రాను ఆదేశించింది.

Next Story