క్రిప్టోలో తెలుగువారి 'స్మార్ట్' మంత్రం : తక్కువ రిస్క్.. దీర్ఘకాలిక లాభాలే లక్ష్యం!

by Ramesh Naini |

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో క్రిప్టో అడాప్షన్ చాలా సంయమనంతో, వ్యూహాత్మకంగా సాగుతోందని ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ 'జియోటస్' తన 2025 వార్షిక నివేదికలో వెల్లడించింది.

క్రిప్టోలో తెలుగువారి స్మార్ట్ మంత్రం : తక్కువ రిస్క్.. దీర్ఘకాలిక లాభాలే లక్ష్యం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: క్రిప్టో కరెన్సీ అంటే కేవలం రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయే సాధనం కాదు.. అది ఒక దీర్ఘకాలిక పెట్టుబడి మార్గం అని తెలుగు రాష్ట్రాల ఇన్వెస్టర్లు నిరూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో క్రిప్టో అడాప్షన్ చాలా సంయమనంతో, వ్యూహాత్మకంగా సాగుతోందని ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ 'జియోటస్' తన 2025 వార్షిక నివేదికలో వెల్లడించింది. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు ఇన్వెస్టర్లు భిన్నమైన, పరిణతి చెందిన ధోరణిని ప్రదర్శిస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

నిలకడైన పెట్టుబడులు.. తక్కువ రిస్క్

దక్షిణాదిలోని ఐదు ప్రధాన రాష్ట్రాల డేటాను విశ్లేషిస్తే, ఏపీ, తెలంగాణలకు చెందిన క్రిప్టో ట్రేడర్ల వాటా 16.9% గా ఉంది. అయితే, మొత్తం ట్రేడింగ్ వాల్యూమ్‌లో వీరి వాటా కేవలం 11.8% మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లోని ఇన్వెస్టర్లు మిగతా వారితో పోలిస్తే అతిగా ట్రేడింగ్ చేయడం లేదు. మార్కెట్ ఒడిదుడుకులకు లోనై త్వరగా అమ్మేయకుండా, చిన్న మొత్తాల్లో స్థిరంగా పెట్టుబడులు పెడుతూ ముందుకు సాగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్: 'HODL' వ్యూహంలో టాప్

ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్లు అత్యంత పరిణతి చెందిన మార్కెట్ లక్షణాలను చూపిస్తున్నారు. ఇక్కడి ఇన్వెస్టర్లలో 21.7% మంది 'HODL' (Hold On for Dear Life) కేటగిరీలో ఉన్నారు. అంటే వీరు తాము కొన్న డిజిటల్ అసెట్స్‌ను దీర్ఘకాలం పాటు భద్రపరుచుకుంటున్నారు. ‘దక్షిణ భారత్‌లోనే అత్యధికంగా ఏపీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను దీర్ఘకాలం పాటు హోల్డ్ చేస్తున్నారు. ఇది భవిష్యత్తుపై వారికి ఉన్న నమ్మకాన్ని, మార్కెట్ పట్ల ఉన్న అవగాహనను సూచిస్తుంది’ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణ: ఆదాయం ఎక్కువ.. ఆసక్తి తక్కువ?

తెలంగాణకు సంబంధించి ఈ నివేదిక ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. దక్షిణాదిలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం అయినప్పటికీ, క్రిప్టో ట్రేడర్ల సంఖ్య మరియు వాల్యూమ్‌లో తెలంగాణ చివరి స్థానంలో నిలిచింది. పెట్టుబడులకు, తలసరి ఆదాయానికి సంబంధం లేదని ఇక్కడ రుజువైంది. క్రిప్టో వ్యాప్తికి కేవలం ఆదాయం మాత్రమే కాకుండా.. పట్టణీకరణ (Urbanization), డిజిటల్ కనెక్టివిటీ ప్రధాన కారణాలని నివేదిక తేల్చింది. తెలంగాణలో పట్టణీకరణ 40.9% ఉండగా, ఏపీలో ఇది 33.4% గా ఉంది.

నిపుణులు ఏమంటున్నారు?

తెలుగు రాష్ట్రాల్లో ఇన్వెస్టర్లు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లేదని జియోటస్ సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్ పేర్కొన్నారు. ‘తెలుగు ఇన్వెస్టర్లు మార్కెట్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. వారి నిదానమైన ధోరణి భవిష్యత్తులో మరింత స్థిరమైన, సురక్షితమైన క్రిప్టో వాతావరణానికి పునాది వేస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తానికి, ఆవేశంతో కాకుండా ఆలోచనతో అడుగులు వేస్తున్న తెలుగు రాష్ట్రాల క్రిప్టో ఇన్వెస్టర్లు.. రాబోయే రోజుల్లో డిజిటల్ అసెట్స్ రంగంలో కీలకంగా మారనున్నారని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

Next Story