- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ పోచంపల్లి ఇక్కత్ వైభవం : రష్మీ భావోద్వేగం

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ వేదికపై.. తెలంగాణ సంస్కృతికి, 200 ఏళ్ల చరిత్ర ఉన్న చేనేత వారసత్వానికి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై భారత్ తరఫున తెలంగాణ పోచంపల్లి ఇక్కత్ చేనేత కళ ప్రదర్శితం కానుంది. మే 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ జరగనున్న 79వ కేన్స్ చలనచిత్రోత్సంలో కేంద్ర ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖ పరిధిలోని ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అంబాసిడర్, మిస్ ఆసియా ఇంటర్నేషనల్ రష్మీ ఠాకూర్ పాల్గొననున్నారు. ఈ చారిత్రాత్మక అవకాశంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పోచంపల్లి ఇక్కత్ చేనేత వస్త్రాలు కేన్స్ రెడ్ కార్పెట్ పై మెరవబోతున్నాయని ఆమె వెల్లడించారు.
200 ఏళ్ల తెలంగాణ చేనేత వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లే అవకాశం తనకు లభించడాన్ని ఎంతో గర్వంగా, గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇది తన ఒక్కదాని విజయం కాదని, పోచంపల్లిలో మగ్గం ముందు కూర్చుని వందల గంటలపాటు రాత్రింబవళ్లు శ్రమించిన ప్రతీ నేతన్న, నేతక్కల శ్రమకు దక్కిన గౌరవంగా చెప్పుకొచ్చారు. మన నేతన్నల చేతుల్లో రూపుదిద్దుకున్న పోచంపల్లి ఇక్కత్.. ఇప్పుడు ప్రపంచ అంతర్జాతీయ వేదికపై మెరవోబోతోందని భావోద్వేగానికి గురయ్యారు. తనను ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అంబాసిడర్‌గా నియమించి, ఈ చారిత్రాత్మక అవకాశాన్ని అందించినందుకు భారత ప్రభుత్వానికి, జౌళి మంత్రిత్వ శాఖకు, చేనేత అభివృద్ధి కమిషనర్ కార్యాలయానికి, వీవర్స్ సర్వీస్ సెంటర్ కు రష్మీ ఠాకూర్ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మైలురాయిని చేరుకోవడంలో భాగస్వాములైన పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (PPCL Weaves), పోచంపల్లి టై & డై సంస్థలతో పాటు గౌరవనీయులైన పోచంపల్లి నేత కార్మికులకు ఆమె ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ చేనేత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు లభించిన ఈ అద్భుత అవకాశాన్ని ఎప్పటికీ మరువలేనని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.






