తెలంగాణ విద్యుత్ రంగంలో కొత్త అధ్యాయం.. రైతు డిస్కం రెడీ

by Naga Rani Yarlagadda |

తెలంగాణ విద్యుత్ రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపిన రైతు డిస్కం (టీజీఆర్‌పీడీసీఎల్) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది.

తెలంగాణ విద్యుత్ రంగంలో కొత్త అధ్యాయం.. రైతు డిస్కం రెడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విద్యుత్ రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపిన రైతు డిస్కం (టీజీఆర్‌పీడీసీఎల్) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల జూన్ 2వ తేదీ నుంచి ఈ నూతన డిస్కం పూర్తిస్థాయి కేడర్ స్ట్రెంత్‌తో తన సేవలను అధికారికంగా ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న దక్షిణ, ఉత్తర డిస్కంల నుంచి వ్యవసాయ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్లను వేరుచేసి ఈ ప్రత్యేక డిస్కంను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్ల విద్యుత్ వినియోగం ఆధారంగా కొత్తగా ఏర్పాటైన రైతు డిస్కం వాటా 42 శాతంగా ఖరారైంది. సీఎండీగా ముషారఫ్ ఫరూఖీ నియమితులయ్యారు. వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల వివరాలు, లొకేషన్ల సేకరణ కోసం రైతు డిస్కం ప్రత్యేక యాప్‌ను రూపొందించి క్షేత్రస్థాయి సర్వేలను ముమ్మరం చేసింది. ఒకప్పుడు ఈ డిస్కంలో చేరేందుకు వెనకడుగు వేసిన ఉద్యోగులు, ఇంజినీర్లు.. ఇప్పుడు ఇందులో చేరేందుకు భారీగా పోటీ పడుతుండటం విద్యుత్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అప్పుడు వద్దు.. ఇప్పుడు ముద్దు

రైతు డిస్కం ఏర్పాటు చేసిన మొదట్లో అందులో డెప్యూటేషన్‌పై వెళ్లడానికి కూడా ఉద్యోగులు తీవ్ర అనాసక్తి చూపించారు. కొన్ని ఉద్యోగ సంఘాల (యూనియన్ల) నేతలు కూడా ఈ డిస్కం ఏర్పాటుపట్ల వ్యతిరేకత వ్యక్తం చేయడంతో అసలు దీని భవిష్యత్తు ఏమిటనే గందరగోళ పరిస్థితి నెలకొంది. కేవలం 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో, దాదాపు 60 మంది సిబ్బందితో అత్యంత సాదాసీదాగా ఈ కంపెనీ స్థాపన ఏర్పాట్లు జరిగాయి. అయినప్పటికీ, ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా పట్టుదలగా రైతు డిస్కం ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లింది. అయితే, కాలక్రమేణా ఉద్యోగుల అభిప్రాయంలో ఊహించని మార్పు వచ్చింది. డిస్కంలో చేరే వారికి ప్రభుత్వం పదోన్నతుల ఆఫర్ ప్రకటించడంతో సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం డిస్కంలో ఖాళీగా ఉన్న సుమారు 500 ఇంజనీర్ల పోస్టుల కోసం ఏకంగా 1260 మందికి పైగా అధికారులు, సిబ్బంది దరఖాస్తు చేసుకోవడం విశేషం.

పెరిగిన క్రేజ్

రైతు డిస్కంలో పోస్టింగుల కోసం ఇంతగా డిమాండ్ పెరగడానికి దాని పరిధి కూడా ఒక ముఖ్య కారణంగా తెలుస్తోంది. ఈ నూతన వ్యవస్థలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఎస్ఈ (సూపరింటెండింగ్ ఇంజనీర్) వ్యవస్థ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కొత్త జిల్లాలకు డీఈ (డివిజనల్ ఇంజనీర్) ఇంచార్జ్‌లుగా వ్యవహరిస్తారు. ఇక సీఈ (చీఫ్ ఇంజనీర్) పరిధి మరింత విస్తృతంగా ఉండనుంది. మొత్తం టీజీఎస్పీడీసీఎల్ పరిధి అంతటికీ కలిపి ఒకరు, అలాగే టీజీఎన్‌పీడీసీఎల్ పరిధి మొత్తానికి మరొకరు చొప్పున కేవలం ఇద్దరు సీఈలు ఇంచార్జ్‌లుగా ఉంటారని సమాచారం. బాధ్యతలు, అధికారాల పరిధి చాలా పెద్దదిగా ఉండటంతో ఇక్కడి పోస్టింగుల కోసం అధికారులు ఎగబడుతున్నారు.

దేశానికే రోల్ మోడల్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ రైతు డిస్కం మోడల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. తెలంగాణలో ఈ ప్రక్రియ విజయవంతంగా ముందుకు సాగుతుండటాన్ని చూసి.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు హర్యానా సహా మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో ప్రత్యేక రైతు డిస్కమ్‌ల ఏర్పాటుకు కసరత్తులు ప్రారంభించాయని నూతన డిస్కంకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

సేవలు వేగవంతం

సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారుల కొరతను అధిగమించేందుకు వచ్చిన దరఖాస్తులను సీనియారిటీ ప్రాతిపదికన పరిశీలిస్తున్నారు. పారదర్శకంగా బదిలీలు, పోస్టింగుల ప్రక్రియను పూర్తి చేసి.. జూన్ 2 కల్లా నూతన కేడర్ స్ట్రెంత్‌ను రంగంలోకి దించి కొత్త డిస్కం సేవలందించనుందని అధికారులు తెలిపారు. ఈ నూతన విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. సమర్థవంతంగా పనిచేసే ఉద్యోగులకు తగిన గుర్తింపు లభించడంతో పాటు, రైతులకు, వినియోగదారులకు మరింత నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందుతాయని విద్యుత్ రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




Next Story