Shivadhar Reddy: తెలంగాణ కొత్త డీజీపీ శివధర్ రెడ్డి.. అడ్వకేట్ నుంచి డీజీపీ వరకు ప్రస్థానం, ప్రత్యేకతలు

by Ramesh Naini |

1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి శివధర్ రెడ్డిని కొత్తగా రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Shivadhar Reddy: తెలంగాణ కొత్త డీజీపీ శివధర్ రెడ్డి.. అడ్వకేట్ నుంచి డీజీపీ వరకు ప్రస్థానం, ప్రత్యేకతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వము రాష్ట్ర పోలీస్‌ శాఖలో కీలక మార్పులు చేపట్టింది. 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి శివధర్ రెడ్డి (Shivadhar Reddy)ని కొత్తగా రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1న తెలంగాణ డీజీపీగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కొత్త డీజీపీ (New DGP) శివధర్‌రెడ్డి నేపథ్యం గురించి తెలుసుకుందాం. హైదరాబాద్‌లో జన్మించిన శివధర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ (పెద్దతుండ్ల) గ్రామానికి చెందినవాడు. ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు ఆయన హైదరాబాద్‌లో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసి తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్‌ చేసి 1994 లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లోకి ప్రవేశించారు. ఏఎస్పీగా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లి లో పని చేసిన ఆయన.. గ్రేహౌండ్స్‌ స్క్వాడ్రన్ కమాండర్‌గా‌, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు.

నయీం ఎన్కౌంటర్ ఆపరేషన్‌..

జిల్లాల ఎస్పీగా, డీఐజీ, ఎస్ఐబీగా మావోయిస్టుల అణిచివేతలో శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. 2014-2016 మధ్యన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయన పనిచేశారు. 2016 నయీం ఎన్కౌంటర్లో ఆపరేషన్‌ను ప్లాన్ చేసిన శివధర్ రెడ్డి.. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావో లో కూడ పని చేశారు. నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు ఎస్పీగా పని చేస్తున్న సమయంలో అనేక సెన్సేషనల్ కేసులను పర్యవేక్షించారు. 2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, పోలీసు కాల్పుల లో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఆ సమయంలో రాత్రి పగలు శ్రమించి, అన్ని వర్గాల ప్రజలలో ధైర్యం నింపి శాంతి భద్రతలను సమర్థంగా కాపాడారు.

ఐక్యరాజ్యసమితి మెడల్ సహా అనేక అవార్డులు..

విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో రోడ్డు భద్రత కోసం Arrive Alive క్యాంపెయిన్ నిర్వహణ.. ఉమ్మడి ఏపీలో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్‌, డైరెక్టర్‌గా శివధర్ రెడ్డి పనిచేశారు. పర్సనల్ వింగ్ లో ఐజీ, అడిషనల్ డీజీ పని చేసిన శివధర్ రెడ్డి.. అడిషనల్ డీజీపీ రోడ్ సేఫ్టీ గాను అనుభవం ఉంది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్ గా మళ్ళీ శివధర్ రెడ్డి నియామకం అయ్యారు. గ్యాలెంట్రీ మెడల్, పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, ఐక్యరాజ్యసమితి మెడల్ సహా అనేక అవార్డులు శివధర్ రెడ్డి అందుకున్నారు.

Next Story