- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ వ్యవసాయ రంగాన్ని కుదిపేస్తున్న కోతుల బెడద.. తేరుకోకుంటే విపత్తే!.. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
తెలంగాణలోని కోతుల సమస్య తీవ్రంగా ఉందని, దీనివల్ల రైతులు వ్యవసాయాన్ని వదిలేసి వలసపోయే పరిస్థితులు వస్తున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కోతుల సమస్య కేవలం ఒక సాధారణ ఇబ్బంది కాదు.. అది రాష్ట్ర వ్యవసాయ రంగాన్నే కుదిపేస్తున్న ఒక సమస్య అని పర్యావరణ వేత్తలు, రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వానరాల బెడద కారణంగా రైతులు వ్యవసాయాన్ని, గ్రామాలను వదిలిపెట్టి వలసపోయే ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయని హెచ్చరించారు. హైదరాబాద్‌లో తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో 'కోతుల బెడదకు చెక్ పెట్టాలి.. రైతాంగాన్ని కాపాడాలి' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సదస్సులో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (FGG) అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కన్నెగంటి రవి, ప్రొఫెసర్ దొంతి నరసింహా రెడ్డి తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
11 జిల్లాల్లో సమస్య తీవ్రం:
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 జిల్లాలో కోతుల బెడదా తీవ్రంగా ఉందని నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లోని ప్రతి మండలంలో కోతులు సమస్య ఉందని వక్తలు చెప్పారు. కోతుల దాడుల వల్ల పంట నష్టమే కాకుండా.. ప్రాణనష్టం జరిగిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయన్నారు. ఈ బాధలు భరించలేక 2014లోనే 'కోతుల బెడద బాధితుల సంఘం' మరియు 'ఐటీ ఫోరం' ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల 'తాము గెలిస్తే కోతులను తరిమేస్తాం' అని అభ్యర్థులు హామీలు ఇచ్చినప్పటికీ.. ఇది కేవలం ఒక గ్రామానికి పరిమితమైన సమస్య కాకపోవడంతో వారు విఫలమయ్యారని పేర్కొన్నారు.
రూ. 500 ఇచ్చి పట్టిస్తే.. పక్క ఊర్లో వదిలేస్తున్నారు!
ప్రస్తుతం క్షేత్రస్థాయిలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని నేతలు చెప్పారు. కోతుల బాధలు తాళలేక రైతులు తమ సొంత డబ్బులు వేసుకుని.. ఒక్కో కోతికి రూ. 500 చొప్పున ఇస్తూ కోతులు పట్టే వారిని పిలిపించుకుంటున్నారు. అయితే, వారు ఈ ఊరిలో పట్టిన కోతులను తీసుకెళ్లి పక్క ఊరి సరిహద్దుల్లో వదిలేస్తున్నారు. దీనివల్ల సమస్య ఒకరి నుంచి మరొకరికి బదిలీ అవుతోంది తప్ప శాశ్వత పరిష్కారం దొరకడం లేదు.
ప్రభుత్వం దృష్టికి రాని క్షేత్రస్థాయి వాస్తవాలు:
గత పదేళ్లుగా కోతుల సమస్య తీవ్రమౌతోందే తప్ప పరిష్కారం దొరకడం లేదని వక్తలు అన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి సాగవుతోందనే లెక్కలు చూసి వ్యవసాయం అంతా బాగుందని ప్రభుత్వం భ్రమిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో రైతుల అగచాట్లు పాలకులకు తెలియడం లేదని అడవిలో ఒక కోతికి కడుపు నిండాలంటే 10 నుండి 12 గంటలు శ్రమించాలి. కానీ గ్రామాల్లో, ఇళ్లల్లో దూరైనా లేదా పంట పొలాలపై పడినా ఒకే గంటలో వాటి కడుపు నిండుతోంది. అందుకే అవి జనావాసాల వైపు వస్తున్నాయి అని విశ్లేషించారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని సీరియస్ చర్యల వల్ల అక్కడ 50 శాతం సమస్య తీరింది. అయితే అక్కడ మంకీ స్టెరిలైజేషన్ (కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు) అంతగా సక్సెస్ కాలేదు. కానీ దేశ రాజధాని ఢిల్లీలో జనావాసాల్లో అల్లరి చేస్తున్న కోతులను పట్టుకెళ్లి దట్టమైన అడవుల్లో వదిలేశారు. వాటికి అడవి లోపలే కావాల్సిన పండ్లు, నీటి వనరులను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో అవి మళ్లీ వెనక్కి రాలేదు. తెలంగాణలోనూ కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని లేదంటే వ్యవసాయ దశ దిశ మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రైతు కమిషన్ చైర్మన్ కోందండ రెడ్డి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ద్వారా కోతుల బెడద నుంచి తప్పించవచ్చన్నారు. ఈ విషయంలో కమిషన్ కార్యాలయానికి వస్తే అక్కడ అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్దామన్నారు.






