- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేబర్ కోడ్స్‌పై తొందరపాటు నిర్ణయాలు ఉండవు
లేబర్ కోడ్స్‌ను హడావుడిగా అమలు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : లేబర్ కోడ్స్‌ను హడావుడిగా అమలు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని, ప్రతి అంశంపై సమగ్రంగా చర్చలు జరిపిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. కార్మికులు నిర్దిష్ట అంశాలపై సూచనలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు. కార్మికుల సంక్షేమంతోపాటు పరిశ్రమల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని పరిశ్రమలు లాభదాయకంగా కొనసాగితేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, కార్మికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. మంగళవారం కార్మిక చట్టాలపై ఎంసీహెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
కార్మిక న్యాయస్థానాలకు సంబంధించిన అంశాలు, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర ప్రభుత్వానికి చేయాల్సిన సిఫార్సులు, రూపొందించాల్సిన నిబంధనలపై విస్తృతంగా చర్చ జరగాలని సూచించారు. లేబర్ కోడ్స్‌పై పారిశ్రామిక వర్గాలు, కార్మిక సంఘాలు ఎలాంటి సంకోచం లేకుండా తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా పరిశ్రమల అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను సిద్ధం చేసేందుకు పారిశ్రామిక సంఘాలతో నెలలుగా చర్చలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
పరిశ్రమలకు ఏయే రంగాల్లో, ఎలాంటి నైపుణ్యాలు అవసరమో గుర్తించి యువతకు శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. కనీస వేతనాల అంశంలోనూ ప్రభుత్వం ఇదే సంప్రదింపుల విధానాన్ని అనుసరించిందని, పారిశ్రామిక సంఘాలు, ఇతర భాగస్వాములతో విస్తృతంగా చర్చించిన తర్వాతే నిర్ణయానికి వచ్చామన్నారు. గత పదేళ్లుగా కనీస వేతనాల్లో పెంపు లేకపోవడంతో కార్మికుల నుంచి అనేక డిమాండ్లు వచ్చాయని గుర్తుచేశారు. కార్మికుల అవసరాలు, పరిశ్రమల పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని సమతుల్య ప్రతిపాదనను రూపొందించామని తెలిపారు.






