- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ వైట్‌హౌస్ కోఠి ఉమెన్స్ కాలేజీ
అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉండే వైస్ హౌస్ తెలిసినంతగా.. హైదరాబాద్ కోఠి లో ఉండే బ్రిటీష్ రెసిడెన్సీ గురించి తెలియదు.

దిశ, తెలంగాణ బ్యూరో: అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉండే వైస్ హౌస్ తెలిసినంతగా.. హైదరాబాద్ కోఠి లో ఉండే బ్రిటీష్ రెసిడెన్సీ గురించి తెలియదు. వాస్తవానికి ఈ రెండు భవనాలకు సంబంధం లేకపోయినా పల్లాడియన్ శైలి, సమకాలీన పరిస్థితులు వీటికి పోలిక తెచ్చిపెట్టాయి. వైట్ హౌస్ 1792లో ప్రారంభమై 1800లో పూర్తయ్యింది. బ్రిటిష్ రెసిడెన్సీ 1803లో నిర్మాణం ప్రారంభమై దాదాపు పదేళ్లలో పూర్తయ్యింది.
వైట్ హౌస్.. బ్రిటీష్ రెసిడెన్సీ
హైదరాబాద్‌లోని బ్రిటీష్ రెసిడెన్సీ అత్యంత అందమైన వారసత్వ భవనాల్లో ఒకటి. యూరోపియన్ శైలిలో నిర్మించిన 200 ఏళ్లనాటి బ్రిటీష్ రెసిడెన్సీని ఉస్మానియా యూనివర్శిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రాంగణంలో ఉంది. కోఠి ఉమెన్స్ కాలేజీగా ప్రసిద్ది చెందినప్పటికీ.. ప్రస్తుతం తెలంగాణ తొలి మహిళా విశ్వవిద్యాలయంగా ఏర్పడింది. ఒక దశాబ్దం పాటు వరల్డ్ మాన్యుమెంట్స్ చేసిన కృషి ఫలితంగా ఈ భవనం ప్రజలకు అందుబాటులో ఉంది. బ్రిటిష్ లెఫ్టినెంట్ కల్నల్ జేమ్స్ అకిలెస్ కిర్క్ పాట్రిక్ కోసం నిర్మించిన బ్రిటిష్ రెసిడెన్సీ భవన నిర్మాణం 1803 లో ప్రారంభమైంది.
ఈ రెసిడెన్సీ నిర్మాణానికి ముందు బ్రిటిష్ రెసిడెంట్ అదే స్థలంలో ఒక పెద్ద ఇంట్లో ఉండేవాడు. జేమ్స్ తన హోదాకు సరిపడా భవన నిర్మాణం కోసం మూసీ నది సమీపంలో 60 ఎకరాల స్థలం కావాలని నిజాం రాజును కోరాడు. నిజాం ప్రభువు ముందుగా ఈ ప్రతిపాదనను ఒప్పుకోకపోయినా, తర్వాత అంగీకరించి రెసిడెన్సీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు అయిన ఖర్చంతా నిజాం ప్రభువు భరించాడు. మద్రాస్ ఇంజనీర్ లెఫ్టినెంట్ శామ్యూల్ రస్సెల్ దీనికి పనిచేశారు. సున్నం, మట్టి ప్లాస్టర్ సహా స్థానిక నిర్మాణ సామగ్రితో మొత్తం నిర్మాణాన్ని భారతీయ హస్తకళాకారులు చేశారు.
దర్బార్ హాల్..
రెసిడెన్సీ ప్రధాన హలును చేరుకోవడానికి 22 పాలరాతి మెట్లు ఉంటాయి. పాలరాయి మెట్ల 60 అడుగుల స్థలంలో రెండు సింహాల సమూహం ఉంది. పోర్టికో ముందు భాగంలో సుమారు 50 అడుగుల ఎత్తులో ఎనిమిది భారీ ఎత్తైన పిల్లర్లు, అప్పటి ప్రభువుల హుందాకు తగ్గట్లుగా ఉంటాయి. అలాగే తెల్లని ఎత్తైన పాలరాయి వేదికపై ప్రధాన సింహద్వారానికి ఇరుపక్కలా పెద్ద సైజు సింహాలు బ్రిటిష్ ఇంపీరియల్ చిహ్నంగా స్వాగతం పలుకుతాయి. ఇది దాటి రాజప్రసాదంలో అడుగిడగానే ఉన్న దర్బార్ హాల్‌లో సుమారు 60 అడుగుల ఎత్తున గల పైకప్పుపై ఆనాటి తైలవర్ణచిత్రాలు నేటికీ చెక్కు చెదరలేదు. ఖరీదైన చాండిలియర్ లు, గోడలకు బిగించిన నిలువెత్తు అద్దాలు, అద్దాల మహల్ చూసేవాళ్ల మనసును ఆకర్షిస్తాయి. బ్రిటీష్ రెసిడెన్సీ నిర్మించిన తర్వాత సుమారు 50 ఏళ్ల దాకా చుట్టూ ఎలాంటి ప్రహరీ నిర్మించలేదు. 1857 లో భారత స్వాతంత్ర సమరంలో భాగంగా రెసిడెన్సీపై ఉద్యమ కారుల దండయాత్ర జరగడంతో చుట్టూ రాళ్లతో ప్రహరీ నిర్మించారు. 1947 లో బ్రిటిష్ వారు వెళ్లిపోయాక రెసిడెన్సీ రెండేళ్ల పాటు ఖాళీగా ఉంది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ కిందకు వెళ్లింది.
పునరుద్ధరణ అనంతరం
తెలంగాణ ప్రభుత్వం, ప్రపంచ మాన్యుమెంట్ ఫండ్ ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు జరిగాయి. ఇందులో భాగంగా భవనం మొదటి అంతస్తులో సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో బ్రిటీష్ రెసిడెన్సీ చరిత్ర, నివాసితులు, భవన నిర్మాణం, పునరుద్ధరణ పనులు, కళాశాల చరిత్ర గురించి చిత్రాలు, రాతపూర్వకంగా దొరుకుతుంది. అంతేకాదు హైదరాబాద్ లో రెసిడెన్సీ ఎలా స్థాపించారనే దానిపై 15 నిమిషాల వీడియోను సందర్శకులకు చూపిస్తారు. ఈ రెసిడెన్సీ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంటుంది.






