అవయవ దానాల్లో దేశంలోనే తెలంగాణ టాప్...

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-04 04:13:40  IST  )

దేశంలో అవయవ దానాల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. ఇందుకుగాను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలంగాణ జీవన్ దాన్ అధికారులకు ఢిల్లీలో అవార్డు అందజేశారు.

అవయవ దానాల్లో దేశంలోనే తెలంగాణ టాప్...
X
  • జీవన్ దాన్ కార్యక్రమానికి జాతీయస్థాయిలో అవార్డు..
  • జాతీయ సగటు రేటు కంటే ఐదు రెట్లు ఎక్కువ..

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో అవయవ దానాల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. ఇందుకుగాను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలంగాణ జీవన్ దాన్ అధికారులకు ఢిల్లీలో అవార్డు అందజేశారు. నేషనల్ ఆర్గాన్ అండ్ ఇష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం మిలియన్ జనాభాకు 4.88 సగటుతో జాతీయస్థాయిలో ముందు వరుసలో ఉండడంతో అవార్డు దక్కింది. ఇక జాతీయ సగటు కేవలం 0.8 మాత్రమే ఉండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే అమెరికాలో ఈ సగటు 30గా ఉండగా స్పెయిన్ ప్రపంచ వ్యాప్తంగా 48తో అగ్రస్థానంలో ఉంది.

జీవన్ దాన్ కార్యక్రమం విశేషాలు ఇవే..

2012లో అప్పటి ప్రభుత్వం చేత ప్రారంభమైన జీవన్ దాన్ కార్యక్రమం ఎంతోమంది అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపింది. అటు ప్రజల్లో అవయవదానాన్ని ప్రోత్సహిస్తూనే, అత్యవసరం అయిన సందర్భాల్లో అవసరమైన వారికి కీలక అవయవాలు పొందే విధంగా పనిచేస్తోంది. క్యాడర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అడ్వైజర్ కమిటీ ( సీ టాక్ ) ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ ప్రోగ్రాం కి హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్మన్గా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడిగా అప్ప్రోపియేట్ అథారిటీ ఫర్ కడావర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ( యాక్ట్), నిమ్స్ డైరెక్టర్ కో చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇప్పటివరకు 673 డోనర్ల నుండి సేకరించిన అవయవాలు కణజాలాన్ని 6309 మందికి విజయవంతంగా ట్రాన్స్పరెంట్ చేయగలిగారు.

అసలు జీవన్ దాన్ ఏమేం పనిచేస్తుందంటే?

- అవయవ సేకరణలో జీవన్ దాన్ పకడ్బందీగా వ్యవహరిస్తుంది. ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా వివిధ దశల్లో అవయవాలను స్వీకరించి అవసరమైన వారికి అమర్చేలా చేస్తుంది.

- ఇందులో ముందుగా బ్రెయిన్ డెత్ అయినట్టుగా సంబంధిత వైద్యుల నుండి నిర్ధారణ చేసుకుంటుంది

- తరువాత డోనర్ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. అవయవ దానం వల్ల కలిగే ఉపయోగాన్ని వివరిస్తుంది.

- అవసరం ఉన్న వారి వివరాలను వంతుల వారీగా స్వీకరించి డాటాను భద్రపరుస్తుంది

- ఇక ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులతో కీలకమైన ఫోరెన్సిక్ విభాగం పోలీస్ లాంటి వివిధ శాఖలతో గ్రీన్ కారిడార్ ఏర్పాటుకు సమన్వయం చేస్తుంది

- ఇక ప్రజల్లో మరింత అవగాహన పెరగడానికి వివిధ మార్గాల ద్వారా ప్రచారం చేస్తుంది.

అనేక విభాగాల సమన్వయం ద్వారా తెలంగాణకు వచ్చిన ఈ గౌరవం తమ బాధ్యతలను పెంచిందని, ప్రజల్లో మరింత అవగాహన కలిగించడం ద్వారా సమాజానికి ఎంతగానో ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగయ్యేలా చేస్తామని నోడల్ అధికారి డాక్టర్ శ్రీ భూషణ్ రాజు అంటున్నారు.

Next Story