రాష్ట్రవ్యాప్తంగా క్రీడల వారోత్సవాలు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో ఈనెల 18వ తేదీ నుంచి క్రీడల వారోత్సవాలు జరగనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా క్రీడల వారోత్సవాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని యువతలో శారీరక దారుఢ్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు వారికి ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా.. ఈ నెల 18 నుండి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా యువజన సేవలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలలో ఆరు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ వారోత్సవాల్లో యువజన సంఘాలు, క్రీడాకారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. మే 18న ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ.. వారోత్సవాల తొలి రోజున ష్ట్రవ్యాప్తంగా ఫిట్‌నెస్.. ఇందులో భాగంగా మారథాన్‌లు, వాక్‌థాన్‌లు, యోగా, ధ్యానం, ఏరోబిక్స్, జుంబా ఈవెంట్స్ నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో 5 కిలోమీటర్ల భారీ మారథాన్ జరగనుంది. జిల్లా కేంద్రాల్లో మారథాన్‌లు, మండల కేంద్రాల్లో వాక్‌థాన్‌లు, వెల్‌నెస్ కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే 19.. కెరీర్ అండ్ నైపుణ్యాభివృద్ధి దినోత్సవం.. రెండో రోజు యువత భవిష్యత్తుకు బాటలు వేసేలా కెరీర్ గైడెన్స్ సెషన్లు ఉంటాయి. నైపుణ్యాభివృద్ధి కోర్సులు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అవకాశాలు, స్కిల్ యూనివర్సిటీ ప్రోగ్రాములు, అగ్నివీర్ నియామకాలపై యువతకు రాష్ట్ర, జిల్లా స్థాయిలలో వర్చువల్ సెషన్‌లు నిర్వహిస్తారు. మే 20.. యువతలో లీడర్‌షిప్ క్వాలిటీస్.. యువతలో లీడర్‌షిప్ క్వాలిటీస్ కోసం విద్యాసంస్థలు, యువజన సంఘాల భాగస్వామ్యంతో యూత్ లీడర్‌షిప్ సమ్మిట్ యువజన పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తారు.

అంతేకాకుండా, సామాజికాభివృద్ధి అంశాలపై విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు ఉంటాయి. మే 21.. ప్లే అండ్ పార్టిసిపేట్,స్పోర్ట్స్ డే.. జిల్లా యువజన, క్రీడాధికారుల పర్యవేక్షణలో స్థానిక క్రీడాకారులు, ప్రజల కోసం వివిధ ఆటల పోటీలు, వినోదాత్మక క్రీడలు నిర్వహిస్తారు. రాష్ట్రస్థాయిలో నగరంలోని ప్రధాన స్టేడియాల్లో ప్రత్యేక క్రీడా ఈవెంట్స్ జరగనున్నాయి. మే 22..సర్వ్ అండ్ సపోర్ట్.. క్లీన్ తెలంగాణ.. మెగా క్లీన్ డ్రైవ్ చేపట్టనున్నారు. యువజన స్వచ్ఛంద సేవకులు, ఎన్‌జీవోలు, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు కలిసి క్రీడా మైదానాలు, పార్కులు, చెరువులు, బహిరంగ ప్రదేశాలు ప్రజా స్థలాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తారు. మే 23..ముగింపు వేడుకలు.. వారోత్సవాల ముగింపు రోజును ఉపాధి పండుగగా నిర్వహించనున్నారు. యువతకు కెరీర్ అవకాశాలపై ప్రత్యేక అవగాహన సదస్సులు ఉంటాయి. ఇటీవల వివిధ జిల్లాల్లో నిర్వహించిన జాబ్ మేళాల్లో ఎంపికైన నిరుద్యోగులకు ఆయా కంపెనీల తరపున నియామక పత్రాలను ఈ వేదికపై అందజేస్తారు. అలాగే అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ సందర్భంగా ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. ఈ వారోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. శాఖల మధ్య సమన్వయం కుదుర్చుకుంటూ, విస్తృత ప్రచారం కల్పించాలని స్పష్టం చేసింది. కార్యక్రమాలకు వచ్చే యువతీ యువకులకు ఇబ్బంది కలగకుండా వేదికలు, తాగునీరు, షేడ్స్, సౌండ్ సిస్టమ్, కూర్చునే ఏర్పాట్లు తదితర మౌలిక వసతులను పక్కాగా ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఆరు రోజుల ఉత్సవాల్లో రాష్ట్రంలోని యువత, విద్యార్థులు, క్రీడా సంఘాలు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ వాలంటీర్లు పాల్గొని జయప్రదం చేయాలని ప్రభుత్వం కోరింది.

Next Story