- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలి : మంత్రి సీతక్క
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు.

- ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా వారోత్సవాలు
- మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంటును సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాం
- మహిళా వారోత్సవాల నిర్వహణపై రాష్ట్ర సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, సామాజిక భద్రత, విద్యా పురోగతి, మహిళల జీవనోపాధి బలోపేతం వంటి అంశాలను ప్రధాన లక్ష్యాలుగా చేసుకుని ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహిళా వారోత్సవాల నిర్వహణ, కార్యక్రమాల షెడ్యూల్, ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో మంత్రి సీతక్క శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా, సామాజికంగా మరింత శక్తివంతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ విద్యుత్ ప్లాంటును ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లుగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం మహిళా సంఘాల ఆర్థిక శక్తికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
వారోత్సవాల్లో భాగంగా ప్రతి రోజుకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించినట్లు అధికారులు వివరించారు. ఈ నెల 25న, నిర్మాణం పూర్తి చేసుకున్న 100 గ్రామ మహిళా సంఘ భవనాలను ప్రారంభించనున్నారు. అదే రోజు రాష్ట్రంలోని 8 వేల గ్రామాల్లో మహిళా సంఘ భవనాల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదేవిధంగా 82 అంగన్‌వాడీ కేంద్ర భవనాలను ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో లోన్ మేళాలు నిర్వహించనున్నారు. 26వ తేదీన మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న 553 ఆర్టీసీ బస్సులను ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు. హైదరాబాద్‌లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ను ప్రారంభించనున్నారు. బాల్య వివాహం బతుకు ఆగం పేరుతో బాల్య వివాహాల నిరోధానికి ప్రత్యేక ప్రచారం, సామాజిక చైతన్య కార్యక్రమాలు, సోషల్ మొబిలైజేషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. 27వ జిల్లా కేంద్రాల్లో మహిళా భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు, పోష్ చట్టంపై అవగాహన సదస్సులు, లోకల్ కమిటీలు (ఎల్సీలు), ఇంటర్నల్ కమిటీలు (ఐసీలు) కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 28వ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. 29వ తేదీన మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇన్క్యుబేటర్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మానవ అక్రమ రవాణా నిరోధక విధానాన్ని ఆవిష్కరించనున్నారు. జిల్లా స్థాయిలో మహిళా సంఘాల జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమాలు, మండల సమాఖ్యల్లో ప్రత్యేక సాధారణ సమావేశాలు నిర్వహించనున్నారు.
30వ తేదీన అమ్మ మాట అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు యూనిఫార్మ్‌ల పంపిణీ, మహిళల్లో అక్షరాస్యత పెంపొందించేందుకు ఉద్దేశించిన అమ్మకు అక్షరమాల కార్యక్రమ విజయోత్సవాలు నిర్వహించనున్నారు. మహిళా వారోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో కొత్త ఆత్మ విశ్వాసాన్ని నింపేలా, మహిళా సాధికారతకు కొత్త దిశా నిర్దేశం చేసేలా నిర్వహించాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, శాఖ డైరెక్టర్ శృతి ఓజా తదితర అధికారులు పాల్గొన్నారు.






