2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

by Naga Rani Yarlagadda |

2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వన్ ట్రిలియన్‌కు, భారత స్వాతంత్ర్య శతవార్షికోత్సవం జరిగే 2047 నాటికి త్రీ ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.

2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వన్ ట్రిలియన్‌కు, భారత స్వాతంత్ర్య శతవార్షికోత్సవం జరిగే 2047 నాటికి త్రీ ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. తెలంగాణ ప్రస్తుతం దేశ జీడీపీలో దాదాపు 5 శాతం వాటాను అందిస్తున్నదని.. 2047 నాటికి ఈ వాటాను 10శాతానికి రెట్టింపు చేయాలని భావిస్తున్నామని తెలిపారు. ఈ లక్ష్య సాధనకు పాలన, పరిశ్రమలు, అట్టడుగు స్థాయి ఆర్థిక కార్యకలాపాలలో నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టడం కీలకమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలు కూడా భాగమని.. వీరికి ఈ ఏడాదే రూ.21,000 కోట్ల రుణాలు అందించామని.. ఎన్‌పీఏలు దాదాపు సున్నా స్థాయిలో ఉన్నాయని తెలిపారు. రాజకీయ పార్టీలు మారినా కొనసాగుతున్న విధాన స్థిరత్వం, సులభతర వాణిజ్య నిర్వాహణ పెట్టుబడిదారులకు భరోసానిస్తున్నాయని చెప్పారు. టీఎస్ ఐపాస్ సింగిల్ విండో వ్యవస్థ ద్వారా అనుమతులు 21 రోజుల్లోనే మంజూరవుతున్నాయని.. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 ద్వారా సాంకేతికత సహాయంతో మరింత పారదర్శకత, పెండింగ్ అనుమతుల రియల్-టైమ్ ట్రాకింగ్ అందుబాటులోకి వచ్చిందని వివరించారు. ఏరోస్పేస్ రంగం ఇప్పుడు ఐటీ, ఫార్మా ఎగుమతులను మించిపోయిందని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్, రాబోయే రీజినల్ రింగ్ రోడ్, వరంగల్, ఆదిలాబాద్‌లలో నిర్మిస్తున్న కొత్త విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా జిల్లా కేంద్రాలకు హైదరాబాద్ స్థాయి కనెక్టివిటీని విస్తరించనున్నట్లు తెలిపారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నెట్ జీరో కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 200 ఎకరాల్లో ఏఐ సిటీ, గ్రీన్ ఫార్మా యూనిట్లు, అన్ని తరగతుల వారికి నివాస ప్రాంతాలు, దేశంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో మొదటి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఉంటాయి. ఎంఎస్ఎంఈల విషయంలో వచ్చే ఐదేళ్ల కోసం రూ.600 కోట్లు కేటాయించామని.. ప్రతి జిల్లాలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నామని మంత్రి ప్రకటించారు.

Next Story