ప్రభుత్వంతో ఇక యుద్ధమే.. స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ

by Javid Pasha |

వేతన సవరణ ప్రకటించాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ డిమాండ్ చేసింది.

ప్రభుత్వంతో ఇక యుద్ధమే.. స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్ ఉద్యోగులకు గతేడది ఏప్రిల్ 1వ తేదీ నుంచి రావాల్సిన వేతన సవరణ ప్రకటించాలని పలు దఫాలుగా ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. అంతేకాకుండా 6 శాతం ఫిట్ మెంట్ పెంచుతామని చెప్పి ఇప్పుడు పెంచడం కుదరదని యాజమాన్యాలు చెప్పడంతో సర్కార్, సంస్థలతో తాడోపేడో తేల్చుకోవాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈనెల 24వ తేదీన విద్యుత్ సౌధ ఎదుట ‘మహా ధర్నా’ను విజయవంతం చేశారు. కాగా యాజమాన్యం బుధవారం చర్చలకు రావాల్సిందిగా జేఏసీ నేతలకు సూచించింది. ఈనేపథ్యంలో ఈ విద్యుత్ ఇంజినీర్స్ భవన్ లో బుధవారం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. ఈ చర్చల్లో యాజమాన్యం 6 శాతం ఫిట్ మెంట్ ఇస్తానని తొలుత చెప్పి ఆపై కుదరదని యాజమాన్యాలు తేల్చేశాయని స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్ రావు తెలిపారు.

ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ ఇతర అంశాలపైనా స్పష్టమైన హామీ ఇవ్వలేదని వారు వాపోయారు. అందుకే ఏప్రిల్ 17వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్లు వారు వెల్లడించారు. చర్చలు విఫలం కావడంతో ఉద్యోగుల నిరుత్సాహానికి గురయ్యారన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి, వేతన సవరణతో పాటు, ఈపీఎఫ్, జీపీఎఫ్, ఆర్టీజన్ సమస్యలు, ఉద్యోగుల న్యాయమైన ఇతర సమస్యలు సత్వరం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ కో కన్వీనర్లు శ్రీధర్, బీసీ రెడ్డి, వైస్ చైర్మన్లు, అనిల్ కుమార్, వజీర్, జాయింట్ సెక్రటరీ గోవర్దన్, సుధాకర్ రెడ్డి, తులసి నాగరాణి, ఫైనాన్స్ సెక్రటరీ కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story