మావోయిస్టుల అరెస్టును ఖండించిన తెలంగాణ రాష్ట్ర కమిటీ

by Malleboina Mahesh |   (  Updated:2025-12-17 07:03:02  IST  )

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం రోజు 16 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

మావోయిస్టుల అరెస్టును ఖండించిన తెలంగాణ రాష్ట్ర కమిటీ
X

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం రోజు 16 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టులపై మావోయిస్టు పార్టీ స్పందిస్తూ.. కీలక లేఖను విడుదల చేసింది. జగన్ పేరుతో విడుదలైన ఈ లేఖలో.. పార్టీ కార్యకర్తల అరెస్టును భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

సిర్పూర్ (యు) మండలంలోని కకర్ బుడ్డి, బాబ్జీ పేట గ్రామాల పరిసరాల్లో నిరాయుధులుగా ఉన్న తమ సహచరులను, గ్రామస్తులతో కలిపి మొత్తం 16 మందిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో వచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడానికే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు.

కోర్టులో హాజరుపరచాలని డిమాండ్

మంగళవారం పోలీసులు అరెస్టు చేసిన వారందరినీ వెంటనే కోర్టులో హాజరుపరచాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాల కోసం, విపక్షాలు లేని దేశాన్ని నిర్మించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని లేఖలో విమర్శించారు. ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ఇతర రాజకీయ పార్టీలు ఈ అక్రమ అరెస్టులను ఖండించాలని, తెలంగాణలో శాంతియుత వాతావరణం కొనసాగేలా మద్దతు తెలపాలని పార్టీ విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగబద్ధమైన సంస్థలను తమ కంట్రోల్‌లో పెట్టుకుని పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నారని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

Read More... మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ.. కీలక నేత ఎర్రగొల్ల రవి సహా ముగ్గురు DVCM క్యాడర్ సభ్యులు అరెస్ట్..?

Next Story