ఎల్ఎఎంఎం-2 విధానాన్ని పునఃసమీక్షించండి : టీబీజేపీ చీఫ్‌కు విజ్ఞప్తి

by Naga Rani Yarlagadda |

సోలార్ సెల్స్ వినియోగం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఎఎంఎం-2 (అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మాన్యుఫ్యాక్చరర్స్) విధానాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ (టీ-ఎస్ఈఏ) డిమాండ్ చేసింది.

ఎల్ఎఎంఎం-2 విధానాన్ని పునఃసమీక్షించండి : టీబీజేపీ చీఫ్‌కు విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సోలార్ సెల్స్ వినియోగం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఎఎంఎం-2 (అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మాన్యుఫ్యాక్చరర్స్) విధానాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ (టీ-ఎస్ఈఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం టీ-బిజెపి చీఫ్ రాంచందర్ రావుకు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ నూతన నిబంధనల వల్ల స్వతంత్ర సోలార్ మాడ్యూల్ తయారీదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయంగా తయారయ్యే సోలార్ సెల్స్‌ను మాత్రమే వాడాలనే నిబంధన తీసుకురావడం వల్ల డిమాండ్‌కు, సరఫరాకు మధ్య విపరీతమైన వ్యత్యాసం ఏర్పడిందని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.అశోక్ కుమార్ గౌడ్, టి.శ్రీహరి బాబు తెలిపారు. ప్రస్తుతం దేశంలో మాడ్యూల్ తయారీ సామర్థ్యం సుమారు 193 గిగావాట్లు ఉండగా, సెల్స్ లభ్యత కేవలం 31 గిగావాట్లు మాత్రమే ఉందని గణాంకాలతో వివరించారు. ఇందులోనూ మెజారిటీ శాతం పెద్ద కంపెనీలు తమ సొంత అవసరాలకే వాడుకుంటున్నాయని, దీనివల్ల బహిరంగ మార్కెట్లో కేవలం 1.9 శాతం (దాదాపు 2,558 మెగావాట్లు) సెల్స్ మాత్రమే అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల దేశవ్యాప్తంగా వందకు పైగా ఉన్న స్వతంత్ర మాడ్యూల్ తయారీ కంపెనీలు, వాటిలో పెట్టుబడి పెట్టిన కోట్లాది రూపాయల నిధులు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ రంగంపై ఆధారపడిన దాదాపు 2 లక్షల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో కొన్ని పెద్ద కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యానికి ఇది దారితీస్తుందని ఆరోపించారు. దేశీయంగా సెల్స్ ఉత్పత్తి సామర్థ్యం కనీసం 70-75 శాతానికి చేరేవరకు ఎల్ఎఎంఎం-2 అమలును వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని వారు కోరారు.

Next Story