రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఎండలు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఎండలు
X
  • పలుచోట్ల మోస్తరు నుండి ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
  • నిజామాబాద్ జిల్లా మెండోరలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
  • నిప్పుల కొలిమిలా తెలంగాణ

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతూ, రికార్డులను తిరగరాస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేడి తీవ్రత అత్యధికంగా ఉంటోంది. నిజామాబాద్ జిల్లా మెండోరలో అత్యధికంగా 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై ఈ వేసవిలోనే రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని పలు ఇతర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటాయి. ఉదయం 10 గంటల నుండే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో రహదారులన్నీ జన సంచారం లేక వెలవెలబోతున్నాయి. నల్గొండ జిల్లా అనుములలో 45.9, నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో 45.9, సిద్దిపేట్ జిల్లా తొగుట లో 45.9, ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ అర్భన్ లో 45.8, పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ లో 45.8, కామారెడ్డి జిల్లా కొల్లూరులో 45.7, కుమరం భీం జిల్లా తిర్యాణిలో 45.7, జగిత్యాల జిల్లా రాఘవపేటలో 45.6, ఖమ్మం జిల్లా కొజిజెర్లలో 45.6, సూర్యాపేట జిల్లా గరిడెపల్లిలో 45.5, మంచిర్యాల జిల్లా భీమారంలో 45.1, కరీంనగర్ జిల్లా మానకొండూర్ లో 44.6 డిగ్రీ సెల్సియస్ ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్రమైన ఎండల దృష్ట్యా మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తగినన్ని నీళ్లు, ద్రవ పదార్థాలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఎండ తీవ్రత కొనసాగుతూనే అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ఉరుములు, మెరుపులతో వర్ష సూచన ఆరెంజ్ అలర్ట్

ఒకవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని పలుచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గాలివేగం గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 2 సెం.మీ, గుండాలలో 1 సెం.మీ, టేకులపల్లిలో 1 సెం.మీ, మణుగూరులో 1 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైంది.

Next Story