ఏకపక్ష నిర్ణయాలతో తెలంగాణ రైజింగ్‌కు విఘాతం.. FICCI కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి గడ్డు కాలం మొదలైందని, ప్రభుత్వ విధానపరమైన అకస్మాత్తు నిర్ణయాలు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిని దెబ్బతీస్తున్నాయని పరిశ్రమల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

ఏకపక్ష నిర్ణయాలతో తెలంగాణ రైజింగ్‌కు విఘాతం.. FICCI కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి గడ్డు కాలం మొదలైందని, ప్రభుత్వ విధానపరమైన అకస్మాత్తు నిర్ణయాలు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిని దెబ్బతీస్తున్నాయని పరిశ్రమల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ముఖ్యంగా జీవో 27, విద్యుత్ టారిఫ్‌ల మార్పు, క్లీన్ ఎనర్జీ అడ్డంకులపై ప్రభుత్వం తక్షణమే పునఃసమీక్ష జరపాలని డిమాండ్ చేశాయి. బుధవారం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసీసీఐ) ఆధ్వర్యంలో సుమారు 50 వేల పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పదికి పైగా పారిశ్రామిక సంఘాలు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

మూడు నుంచి ఐదు రెట్లు పెరిగిన బిల్లులు

లీడ్ కేవీఆర్ హెచ్ బిల్లింగ్‌ను అకస్మాత్తుగా అన్‌బ్లాక్ చేయడం వల్ల పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడిందని నాయకులు పేర్కొన్నారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే డిస్కామ్‌లు ఈ విధానాన్ని అమలు చేయడంతో, పారిశ్రామిక వినియోగదారుల విద్యుత్ బిల్లులు మూడు నుంచి ఐదు రెట్లు పెరిగాయని వాపోయారు. సాంకేతిక అవగాహన, తగిన సమయం ఇవ్వకుండా అమలు చేయడం వల్ల ఇది పరిశ్రమల మనుగడకే ప్రశ్నార్థకంగా మారిందని, దీనిపై తక్షణమే నిపుణుల కమిటీ వేయాలని కోరారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హిల్ట్) కింద జారీ చేసిన జీవో 27పై పరిశ్రమలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న పరిశ్రమలను తరలించే విషయంలో స్పష్టత లేదని, పునరావాసం, పరిహారంపై ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. పరిశ్రమలను నివాస గృహాల మాదిరిగా తక్షణమే మార్చలేమని, ఈ విషయంలో ఏకపక్ష నిర్ణయాలు కాకుండా సంప్రదింపుల ద్వారా పరిష్కారం కనుగొనాలని సూచించారు.

నిలిచిపోయిన గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు..

క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకటించి ఏడాది కావస్తున్నా, సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఒక్క ఎన్ఓసీ కూడా జారీ కాలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీనివల్ల వందల కోట్ల పెట్టుబడులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, గతంలో ఉన్న రాత్రి పూట విద్యుత్ రాయితీని పునరుద్ధరించాలని లేదా పగటి వేళ తక్కువ ధరకు లభించే సోలార్ విద్యుత్ ప్రయోజనాన్ని తమకు బదిలీ చేయాలని కోరారు. ఒకవైపు ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ అంటూ పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. కానీ ఉన్న పరిశ్రమలే ఇబ్బందుల్లో ఉంటే కొత్త పెట్టుబడులు ఎలా వస్తాయని పారిశ్రామిక ప్రతినిధులు ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పారిశ్రామికవేత్తల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఫిక్కీ అధ్యక్షులు ఆర్. రవి కుమార్, టీఐఎఫ్ అధ్యక్షులు కె. సుధీర్ రెడ్డి, సీఐఏ అధ్యక్షులు డి. శ్రీనివాస రెడ్డి సహా పలువురు పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story