- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారి.. ప్రపంచ స్థాయి వేడుకగా భారీ ఏర్పాట్లు
హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారి.. ప్రపంచ స్థాయి వేడుకగా భారీ ఏర్పాట్లు

దిశ, వెబ్‌డెస్క్: తరలి రండి- ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకొండి..(Come, Join the Rise) అనే నినాదంతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిర్ణయించారు. దేశ విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రముఖులను ప్రభుత్వం ఈ సదస్సుకు ఆహ్వానిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీరంగ ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయస్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవనున్నారు. వివిధ రంగాల ప్రముఖులను సదస్సుకు ఆహ్వానించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట ప్రభుత్వం ఆహ్వన లేఖలను పంపిస్తోంది.
సీఎం ఆహ్వాన లేఖలు:
‘వికసిత్ భారత్-2047 జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా మా ప్రజా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యుమెంట్‌ను తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, అన్ని వర్గాల సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు తెలంగాణకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. ఈ లక్ష్యాలను.. మా ప్రభుత్వం సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025’ను నిర్వహిస్తున్నాము. తప్పకుండా తరలిరండి..’ అనే ఆహ్వాన సందేశంతో ఈ లేఖలు పంపించారు. ప్రభుత్వం పంపించిన ఆహ్వానం అందుకున్న ప్రముఖుల్లో కొందరు సదస్సుకు హాజరవుతున్నట్లు ప్రకటించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజవంశానికి చెందిన షేక్ తారిక్ అల్ ఖాసిమీ, రాస్ అల్ ఖైమా, డాయిచ్ బోర్స్ (Deutsche Borse) గ్రూప్ హెడ్ లుడ్విగ్ హెయిన్జెల్మాన్, ఎన్రిషన్ (Enrission) వ్యవస్థాపక భాగస్వామి డబ్ల్యూ విన్స్టన్, మాండల్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈఓ బెనెట్ నియో తో పాటు పలు టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ ఫౌండర్లు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. తెలంగాణ ప్రగతి సంక్షేమాన్ని, అన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ వేదికను అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచం నలుమూలాల నుంచి పెట్టుబడులను ఆకర్షించటంతో పాటు గ్లోబల్ ఇన్నోవేషన్ దిశగా తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటిచెప్పాలని సంకల్పించింది.
మెస్సీ కిక్‌తో ముగింపు
రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. ఈనెల 13న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన పాల్గొనే వేడుకలోనే ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలుస్తుంది.






