- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. వరంగల్, ఆదిలాబాద్ విషయంలో సీఎం కీలక ప్రకటన
దావోస్ వేదికగాగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి.

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో (Davos WEF) తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం ఆయా రంగాల్లో పలు దిగ్గజ పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు ముందుకు వచ్చాయి. ఎంవోయూలు చేసుకున్న కార్యక్రమాలలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్వయంగా పాల్గొంటున్నారు. ప్రపంచంలోనే తొలి బ్యూటీ–టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ను హైదరాబాద్‍లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ (L'Oreal) సంస్థ ప్రకటించింది. ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్‌లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోరియల్ సీఈవో నికోలస్ హియోరోనిమస్‍తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులతో బ్యూటీ–టెక్ జీసీసీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ జీసీసీ ఏర్పాటుతో లోరియల్‌కు గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా నిలవనుంది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ, అనలిటిక్స్ రంగాల్లో రూపొందించే సాంకేతిక పరిష్కారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్ యూనిట్లకు అందిస్తామని హియెరోనిమస్ తెలిపారు. దీంతో గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్ కార్యకలాపాలకు హైదరాబాద్ ప్రాముఖ్యత మరింత పెరుగనుంది.
తెలంగాణతో బ్లైజ్ ఒప్పందం:
తెలంగాణ ప్రభుత్వం దావోస్‌లో కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ (Blaze) సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో బ్లైజ్ కో ఫౌండర్ సీఈఓ దినాకర్ మునగాలా ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల అనంతరం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థ డేటా సెంటర్ అర్టిఫిషియల్ కంప్యూటింగ్‍కు తక్కువ శక్తి వినియోగించే AI హార్డ్‌వేర్, ఫుల్-స్టాక్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఒప్పందంతో తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు వేగవంతం కానున్నాయి. ఈ ఒప్పందం సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దడం... వచ్చే రెండు దశాబ్దాల్లో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యానికి అత్యంత కీలకమని అన్నారు. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, క్వాంటం కంప్యూటింగ్, హార్డ్‌వేర్, ఆటోమేషన్ రంగాల్లో తెలంగాణ వేగంగా ముందుకు సాగుతోందని, దేశంలోనే టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ వృద్ధి సాధిస్తోందని అన్నారు. బ్లైజ్ సంస్థ హైదరాబాద్ ఆర్ అండ్ డీ యూనిట్ విస్తరణకు ప్రభుత్వం తగిన మద్దతు అందిస్తుందని హామీ ఇచ్చారు.
రూ.6 వేల కోట్లతో రియాక్టర్ విద్యుత్ ప్లాంట్
దావోస్ వేదికగా క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. రూ.6 వేల కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్‌ఎంఆర్) ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) సమర్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందన్నారు. 2047 నాటికి నెట్–జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో సుస్థిర అభివృద్ధే తెలంగాణకు ప్రధానమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాగా స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్ , భారత్‌కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ఏర్పడింది. గరిష్ఠంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణ లో కొత్త విద్యుత్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం పెట్టుబడి విలువ 600 మిలియన్ యూరోలు (సుమారు రూ.6,000 కోట్లు).
వరంగల్ లేదా ఆదిలాబాద్ లో MRO:
విమానయాన రంగంలో పేరొందిన అమెరికాకు చెందిన సర్గడ్ (Sargad) సంస్థ రాష్ట్రంలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ నెలకొల్పనుంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో దశలవారీగా రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో సర్గడ్ సంస్థ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఇవాళ సర్గాడ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీనివాస్ తోట ముఖ్యంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణలో విమానాల నిర్వహణ, మరమ్మత్తులు, పునరుద్ధరణ (MRO) కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆసక్తిని సంస్థ ప్రతినిధులు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను మూడు ప్రత్యేక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సేవల రంగానికి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, తయారీ రంగానికి పెరి–అర్బన్ రీజియన్ ఎకానమీ, వ్యవసాయం, గ్రీన్ ఎకానమీ కి రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్‌లలో రెండు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్రాంతాల్లో ఏదైనా ఒక చోట ఎంఆర్వో కేంద్రం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సంస్థ సీఈఓకు సూచించారు. వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి అత్యధిక ప్రోత్సాహకాలు అందిస్తామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు.
Read More... Master Card: హైదరాబాద్‍కు మరో అంతర్జాతీయ సంస్థ కార్యాలయం.. దావోస్ వేదికగా కీలక ప్రకటన






