కేంద్రం కులగణనపై తెలంగాణ నేతల స్పందన

by Ajay Maddhiboyina |   (  Updated:2025-04-30 17:02:31  IST  )

తెలంగాణలో కాంగ్రెస్ ​ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికే ఆదర్శంగా నిలిచింది.

కేంద్రం కులగణనపై తెలంగాణ నేతల స్పందన
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ​ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ సర్వే యావత్​ భారతావానికి దిక్సూచిగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజకీయ ,కుల సర్వేను నిర్వహించింది. ఈ సర్వే రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు (బీసీ), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని కాంగ్రెస్​ సర్కార్ తెలిపింది.

రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య వెలువడిన అసమానతలను తగ్గించడానికి అనుకూల విధానాలు, అఫెర్మెటివ్ పాలసీలను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్లింది. దేశ స్వాతంత్య్రం నాటి నుంచి ఎదురు చూస్తున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి సారి ఆచరించి ఆదర్శనీయంగా నిలిచింది. దేశంలోని వివిధ కులాల సంబంధిత స్థితిగతులను అర్థం చేసుకోవడానికి, తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజకీయ కుల సర్వేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానించింది.

ఈనేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కులగణనపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో జనగణనతోపాటు కులగణన కూడా నిర్వహించాలనే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నది. రాబోయే జనాభా లెక్కలతో పాటు కులగణన నిర్వహించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షత రాజకీయ వ్యవహారాల కమిటీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు వివరాలను కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. 1931లో చివరి సారిగా కుల గణన జరిగిందని, ఆటు తరువాత తెలంగాణలోనే కుల గణన జరగడం విశేషం.

రాహుల్ కల సాకారం: సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ సీఎం స్పందించారు. కులగణన చేపట్టాలనే కేంద్ర నిర్ణయాన్ని తాను అభినందిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర కేబినెట్ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో రాహుల్ గాంధీ విజన్ సాకారం కాబోతుందని, విపక్షంలో ఉండి కూడా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఆయన ప్రభావితం చేశారని అన్నారు. దేశంలో కులగణన చేపట్టిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది స్వతంత్ర దేశంలోనే మొదటిది, చివరిది 1931లో బ్రిటిష్ వారు నిర్వహించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సామాజిక, ఆర్థిక, కుల సర్వే నిర్వహించడం జరిగిందని, జనాభాలో 56.32 శాతం మంది వెనుకబడిన కులాలకు చెందినవారని తేలిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ శాసన సభలో ఆమోదించిన నివేదిక ఆధారంగా, రాష్ట్రంలో విద్య, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్లలో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కూడా పరిష్కరించి, ప్రతిపాదించిందని పేర్కొన్నారు. దేశ రాజధానితో సహా దేశవ్యాప్తంగా పోరాటాన్ని చేపట్టి, కేంద్ర ప్రభుత్వం కుల గణనకు అంగీకరించాలని కోరుతూ జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలియజేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఈరోజు, చివరకు, తెలంగాణ నేడు ఏమి చేస్తుందో, భారతదేశం రేపు అనుసరిస్తుందని తాము నిరూపించామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ తన దార్శనికత చూపించడం గర్వకారణమన్నారు. జాతీయ జనాభా లెక్కల్లో భాగంగా కుల గణనను నిర్వహించాలని నిర్ణయించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి, మంత్రివర్గానికి ఈ సందర్భంగా సీఎం రేవతంత్​రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

కులగణనపై కేంద్ర నిర్ణయం తెలంగాణ సర్కారు విజయం: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

జనాభా లెక్కల్లో భాగంగా కులగణన కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం కాంగ్రెస్‌ ప్రభుత్వ విజయమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కుల గణనతో తెలంగాణలో ఏ కులం వారు ఎంత నిష్పత్తిలో ఉన్నారని తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం నిర్ణయం తీసుకొని పారదర్శకంగా కుల గణన సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. దేశ చరిత్రలో మొదటిసారిగా కుల గణన నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. రాహుల్‌ గాంధీ ఆలోచన మేరకు తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే శాస్త్రీయంగా కులగణనను విజయవంతంగా పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కులగణన లెక్కల ఆధారంగా తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్పించిందన్నారు. కాంగ్రెస్‌ నిర్వహించిన కులగణనను ఇంతకాలం అపహాస్యం చేసిన బీజేపీ ఇప్పుడు దారిలోకి రావడం శుభ పరిణామని.. ప్రజాభీష్టానికి లొంగి కులగణనను చేపట్టాలని నిర్ణయంచిన కేంద్ర ప్రభుత్వం అదే బాటలో తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును 9 వ షెడ్యూల్ లో చేర్చి చట్టబద్దత కల్పించాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు.

తెలంగాణ దేశానికి దిక్సూచి– మంత్రి పొన్నం ప్రభాకర్

కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేసే జనాభా లెక్కల్లో కుల గణన చేస్తామనడం తెలంగాణ ప్రభుత్వ విజయం అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాజిక అసమానతలు తొలగించడానికి దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ముందుగా తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేసి దేశానికి దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. కుల గణన ఆధారంగా బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన ఆధారంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం చేసే జనాభా లెక్కల్లో కుల గణన చేస్తామని పేర్కొనడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో కుల గణన చేయడానికి బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచడానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సహచర మంత్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ ఒత్తిడితోనే కేంద్రం కుల‌గ‌ణ‌న‌కు అంగీకారం– మంత్రి కొండా సురేఖ

మ‌న దేశానికి దిక్సూచిగా నాడు బెంగాల్ ఉంటే... నేడు తెలంగాణే అని రాష్ట్ర అట‌వీ, పర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. సామాజిక దృక్పథం క‌లిగిన తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం కుల‌గ‌ణ‌న‌కు అంగీకారం తెలిపింద‌ని ఆమె అన్నారు. ఇది తమ నాయ‌కుడు రాహుల్ గాంధీ ఆశ‌, ఆశ‌య‌మ‌ని... తమ రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల కృషి అని సురేఖ అభిప్రాయ‌ప‌డ్డారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అంటూ సురేఖ వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల ప‌ట్ల ఒక బీసీ బిడ్డగా... బీసీ మంత్రిగా ఎంత‌గానో సంతోష ప‌డుతున్నట్టు ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేసే జనాభా లెక్కల్లో కుల గణన చేస్తామనడం తెలంగాణ ప్రభుత్వ సంపూర్ణ విజ‌య‌మ‌ని మంత్రి సురేఖ చెప్పుకొచ్చారు. తమ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత‌ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాజిక అసమానతలు, కుల రుగ్మతలు తొలగించడానికి దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని డిమాండ్ చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా సురేఖ గుర్తు చేశారు. రాష్ట్రంలో త‌మ ప్రభుత్వం చేప‌ట్టిన కులగణన ఆధారంగా బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన ఆధారంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం చేసే జనాభా లెక్కల్లో కుల గణన చేస్తామని పేర్కొనడం సంతోషంగా ఉంద‌న్నారు. ఇది ఒక్క విప్లవాత్మకమైన చ‌ర్యగా తాను అభివ‌ర్ణిస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా సామాజిక రుగ్మతలు తొలగి అందరికీ సామాజిక న్యాయం జరుగుతుందని ఆకాంక్షిస్తున్నట్టు మంత్రి సురేఖ చెప్పారు.

ఎన్డీఏ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం– భువనగిర ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి

ఢిల్లీలోని ఎన్డీఏ ప్రభుత్వం క్యాబినెట్ లో కులగనన చేయాలన్న ఆలోచనను తాము స్వాగతిస్తున్నామని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం మేరకు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కల గణనను ఇంప్లిమెంట్ చేసేలా ఒక శాస్త్రీయ బద్ధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ అసెంబ్లీలో కల గణనకు సంబంధించి ఆమోదించిన 42% శాతం రిజర్వేషన్ ను పార్లమెంట్​లో బిల్లు పెట్టాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కార్యక్రమం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఈక్రమంలో జనాభా లెక్కల్లో భాగంగా కుల గణన కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఫలించిన బీసీల పోరాటం..– జాజుల శ్రీనివాస్ గౌడ్

జాతి జనగణనలో సమగ్ర కులగణన చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇప్పటికైనా గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఏప్రిల్ 2 న ఢిల్లీలో చేసిన బీసీలు ధర్నా చేయడం, ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడంతో కేంద్రం దిగి వచ్చిందని, తద్వారా బీసీల పోరాటం ఫలించిందని పేర్కొన్నారు. తెలంగాణ, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కులగణన చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగిందని అన్నారు. ఇప్పటికైనా సామజిక రిజర్వేషన్ల పై విధించిన 50% పరిమితిని ఎత్తివేసి, తెలంగాణలో 42%, బీహార్ లో 65% రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదించాలన్నారు. దేశవ్యాప్తంగా కులగణన మొదలు పెట్టి, బీసీ రిజర్వేషన్లు జనాభా ధమాషా ప్రకారం పెంచే వరకు దేశ వ్యాప్తంగా బీసీల పోరాటాన్ని ఆపేది లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కుల గణనను స్వాగతిస్తున్నాం- ఎంపీఆర్ కృష్ణయ్య

కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం ప్రకటించిన కుల గణన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు, కుల గణన కోసం జాతీయ స్థాయిలో పని చేసిన బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ను బుధవారం హైదరాబాద్ లోని బీసీ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఆర్. కృష్ణయ్య అభినందించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని అనేక పోరాటాలు చేశామని కేంద్ర ప్రభుత్వం కుల గణన చేయడాన్ని తాము హర్షిస్తున్నామన్నారు.

బీసీ ఉద్యమాల ఫలితమే దేశ వ్యాప్త కుల గణన-జక్కని సంజయ్ కుమార్

బీసీ ఉద్యమాల ఫలితం వల్లే దేశ వ్యాప్త కుల గణనకు కేంద్రం సిద్ధం అయిందని బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. గతంలో కుల గణన సాధన కోసం ఢిల్లీలోని అన్ని రాజకీయ పార్టీలను కలుస్తూ పార్టీల మద్దతును కూడగట్టమన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ డిమాండ్ కు మద్దతు తెలిపాయని, ఆర్ఎస్ఎస్ కూడా మద్దతు తెలిపిందన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు కోటి సంతకాలతో వినతి చేశామని, కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా, కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రివర్యులు రాందాస్ అతవలే, బిల్ వర్మలను పదులసార్లు కలిసి వినతులు అందజేశామని తెలిపారు. జంతర్ మంతర్ ధర్నాలు, ఢిల్లీలో, హైదరాబాదులో సదస్సులు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సత్యాగ్రహ దీక్షలు చేశామని, గతంలో తెలంగాణలో 12 రోజుల ఆమరణ దీక్ష చేశామన్నారు. ఢిల్లీలో 22 రోజుల సత్యాగ్రహ దీక్ష చేశామని అనేక పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కుల గణన చేపడుతూ తీర్మానం చేయడానికి స్వాగతిస్తున్నామని కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ప్రకటించారు. చట్టసభల్లో బీసీల వాటా కోసం, విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో మేమెంతో మాకంత వాటా అనే నినాదంతో పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడ్గే, బీసీ ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు కుడికాల భాస్కర్, వ్యాసబట్టు మధుసూదన్ రాజు, చిలకమర్రి శ్రీనివాస్, జిలకల లక్ష్మణరావు, సాయిబాబా, మురళి, కత్తుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర కేబినేట్‌ నిర్ణయంపై హర్షం– బీసీ కమిషన్‌ చైర్మన్ నిరంజన్

జనగణన, కులగణన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీసీ కమిషన్‌ స్వాగతిస్తోందని బీసీ కమిషన్‌ చైర్మన్ నిరంజన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జనగణన, దానితోపాటు కులగణన చేపట్టాలని కేంద్ర కేబినేట్‌ ఆమోదించడంపట్ల తెలంగాణ బీసీ కమిషన్‌ హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. తెలంగాణలో కులాల సర్వే జరిపి, 42% వెనుకబడిన తరగతుల ప్రజలకు రాజకీయ విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని, శాసన సభ 2 బిల్లులు పాస్‌ చేయించి, కేంద్ర ప్రభుత్వం ఆమోదానికి పంపించడం జరిగిందన్నారు. తెలంగాణలో ఈ ప్రక్రియ పూర్తయినందున దేశవ్యాప్తంగా జనగణన, కులగణన జరిగే వరకు ఆగకుండా తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి తెలంగాణలో అమలయ్యేలా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్‌ చైర్మన్ నిరంజన్​ కోరారు.

కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం– బీఆర్ఎస్ రాష్ట్ర నేత, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిశోర్ గౌడ్

రాబోయే జనగణలో కుల గణన కూడా చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. జనాభాలో సగం పైగా ఉన్న బీసీల లెక్కలు తీయాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నామని, బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వయంగా పార్టీ అధినేత కేసిఆర్ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. ఎన్నోసార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలను టిఆర్ఎస్ పార్టీ డిమాండ్, విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. అందరి డిమాండ్లకు తలోగ్గి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి జనగణనతోపాటు కులగణన చేయాలని నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం అని కిశోర్ గౌడ్ అన్నారు . తక్షణమే జనాభా లెక్కలను చేపట్టాలని, అలాగే, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కిశోర్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రిజర్వేషన్ల పెంపు, రాజ్యాంగబద్ధ హక్కులను దక్కేలా చూడాలి– టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్

రాహుల్ గాంధీ ఒత్తిడికి తలొగ్గి కుల గణనకు కేంద్రం అనుమతించడం స్వాగతిస్తున్నామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ అన్నారు. దేశాన్ని ఎక్స్ రే తీసి వనరుల్లో సంపదలో పేద వర్గాలకు వాటా పంచాలన్న రాహుల్ గాంధీ డిమాండ్ న్యాయబద్ధమైనదన్నారు. కులగణన చేయడమే కాదు .. రిజర్వేషన్ల పెంపు, రాజ్యాంగబద్ధ హక్కులను ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కేలా చూడాలన్నారు. గాంధీ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో 90 శాతం ఉన్న పేద వర్గాలకు వనరుల్లో, సంపదలో వాటా దక్కాలన్న రాహుల్ గాంధీ బలమైన డిమాండ్ తో.. కులగణన చేపట్టి, వారి జనాభాకు తగ్గట్టుగా వాటా పంచాలన్న ఆయన న్యాయమైన డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదని వ్యాఖ్యనించారు. అయితే కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా కుల గణన చేపట్టి, న్యాయపరంగా, రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు లభించాల్సిన వాటాను అందించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్ లాగా భావించి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే కులగణన చేపట్టడం జరిగిందన్నారు. కేసీఆర్ లాగా గణన చేసి బహిర్గతం చేయకుండా ఉండొద్దన్నారు. తెలంగాణ అనే పదమే కేసీఆర్​తన పార్టీ నుంచి తీసేశాడని పేర్కొన్నారు. తెలంగాణ పదానికి నిషేధం పలికిన చంద్రబాబు.. కేసీఆర్ కి ఆదర్శమని దుయ్యబట్టారు. అందుకే తన పార్టీ పేరు బీఆర్ఎస్​గా మార్చుకున్నాడని, తెలంగాణ పదం తీసేసిన దుర్మార్గుడు కేసీఆర్ కు తెలంగాణతో పనేముందని విమర్శించారు.

Next Story