జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలంగాణ పోలీస్ : సత్కరించిన డీజీపీ సీవీ ఆనంద్

by Naga Rani Yarlagadda |

విధి నిర్వహణలోనే కాదు, క్రీడల్లోనూ తెలంగాణ పోలీసులు తమ సత్తా చాటారు. జాతీయ స్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి పతకాల పంట పండించారు.

జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలంగాణ పోలీస్ : సత్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
X
  • ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పతకాల పంట

దిశ, తెలంగాణ బ్యూరో : విధి నిర్వహణలోనే కాదు, క్రీడల్లోనూ తెలంగాణ పోలీసులు తమ సత్తా చాటారు. జాతీయ స్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి పతకాల పంట పండించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఇటీవల జరిగిన '2వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ క్లస్టర్ ఛాంపియన్‌షిప్ 2025-26 లో రాష్ట్ర పోలీస్ క్రీడాకారులు ఏకంగా 12 పతకాలను ఒక స్వర్ణం, 4 రజతాలు, 7 కాంస్యాలు కైవసం చేసుకున్నారు. వీరికి తోడు జాతీయ షూటింగ్ పోటీల్లో రాష్ట్రానికి చెందిన మరో అధికారి పతకం సాధించారు. ఈ విజేతలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం తన కార్యాలయంలో ఘనంగా సత్కరించి, అభినందించారు.

బ్యాడ్మింటన్, షూటింగ్‌లో సత్తా.. లక్నోలో జరిగిన బ్యాడ్మింటన్ ఉమెన్స్ డబుల్స్ విభాగంలో రాష్ట్ర ట్రైనీ డీఎస్పీలు నేహా పురోహిత్, పి.లతీఫా ఆశా అద్భుత ఆటతీరుతో స్వర్ణ పతకం సాధించారు. లతీఫా ఆశా ఉమెన్స్ సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్- ఏసీపీ కొత్త కిషన్ రావుతో కలిసి మరో రెండు రజతాలు గెలుపొందగా.. 45+ మెన్స్ డబుల్స్‌లో గ్రేహౌండ్స్ ఏసీపీ మాచా శ్రీనివాసరావు, నార్కోటిక్స్ ఏసీపీ పెండ్యాల శ్రీనివాస్ జోడీ రజతం కైవసం చేసుకుంది. ఇక వివిధ కేటగిరీల్లో ఏసీపీలు దేవినేని ధనలక్ష్మి, శ్రీనివాసరావు,పి.కాశిరెడ్డి, ప్రసన్న లక్ష్మి, డీఎస్పీలు వశంశెట్టి మాధవి, నేహా పురోహిత్ కాంస్య పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఇండియా ఓపెన్ షూటింగ్ కాంపిటీషన్ లో రైఫిల్ & పిస్టల్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఇన్‌స్పెక్టర్ బి.జేమ్స్ బాబు మాస్టర్స్ విభాగంలో కాంస్య పతకం సాధించారు.

టేబుల్ టెన్నిస్‌లోనూ.. టేబుల్ టెన్నిస్ 50+ మిక్స్‌డ్ డబుల్స్‌లో ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్, హుజూరాబాద్ డీఎస్పీ వశంశెట్టి మాధవి రజతం సాధించారు. మాధవి మరో రెండు విభాగాల్లో ఆక్టోపస్ డీఎస్పీ జి.రాజు, మల్కాజిగిరి ఎస్సై సాయిప్రసాద్‌లతో కలిసి కాంస్యాలు సాధించగా.. కరీంనగర్‌కు చెందిన మహిళా ఏఎస్సైలు కారంగుల పద్మ, పల్లి ఉమారాణి జోడీ కాంస్యం దక్కించుకుంది. శుక్రవారం జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో పోలీసు క్రీడా విభాగం ఐజీపీ డాక్టర్ గజరావు భూపాల్, క్లస్టర్ టీమ్ మేనేజర్,డీసీపీ జి.నరసింహారెడ్డి, కోచ్ ఏ.అశోక్, పోలీసు స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.వి. రామారావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో పోలీసు శాఖ ప్రతిష్ఠను పెంచిన క్రీడాకారులను ఈ సందర్భంగా డీజీపీ ప్రత్యేకంగా ప్రశంసించారు.

Next Story