- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వచ్ఛ సర్వేక్షన్‌లో తెలంగాణకు షాక్.. కేంద్రం వివక్ష చూపిందా ?
స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు తీవ్ర అన్యాయం జరిగింది.

దిశ, తెలంగాణ బ్యూరో : స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు తీవ్ర అన్యాయం జరిగింది. గతేడాది 26 అవార్డులు సాధించిన పురపాలకశాఖ ఈసారి రెండు అవార్డులను మాత్రమే దక్కంచుకున్నది. గతేడాది మాదిరిగా కాకుండా జోనల్ స్థాయిలో ర్యాంకులు ప్రకటించకపోవడం, స్వచ్ఛ సర్వేక్షన్ టూల్ కిట్ ఇచ్చినప్పుడు రూపొందించిన మార్గదర్శకాలు, ర్యాంకులు ప్రకటించడానికి ముందు జారీ చేసిన మార్గదర్శకాల్లో చాలా మార్పులు, గందరగోళం నెలకొందని.. ఫలితంగానే ర్యాంకులు, అవార్డులు రాలేదని అధికారులు చెబుతున్నారు.
1800లోపు ర్యాంకులు
దేశ వ్యాప్తంగా సుమారు 4,500 మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షన్‌లో పాల్గొన్నాయి. ఇందులో తెలంగాణకు చెందిన మున్సిపాలిటీలు 1800లోపు ర్యాంకులు సాధించాయని ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో పాటు స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకుల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని పలువురు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు.
రెండే అవార్డులు
రాష్ట్రంలో 16 మున్సిపల్ కార్పొరేషన్లు, 142 మున్సిపాలిటీలున్నాయి. కొత్తగా ప్రకటించిన రెండు మున్సిపాలిటీలను కలిపితే ఆ సంఖ్య 160కి చేరింది. వీటిలో జీహెచ్ఎంసీకి తెలంగాణ స్వచ్ఛ షెహర్‌తో పాటు 7స్టార్ ర్యాంకు వచ్చింది. దీంతో పాటు దేశంలోని 58 కంటోన్మెంట్లలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు మొదటి ర్యాంకు దక్కింది. పారిశుధ్య నిర్వహణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో ఉత్తమ పనితీరుకు గాను ప్రత్యేక కేటగిరీ కింద ఈ అవార్డు దక్కింది. తర్వాతి స్థానంలో నార్సింగి మున్సిపాలిటీ ఉంది. రాష్ట్రంలో జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్, నార్సింగి, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఫీర్జాదిగుడ, కోరుట్ల, మణికొండ, దమ్మాయిగుడ, హుస్నాబాద్, మహబుబ్‌నగర్ స్వచ్ఛ సర్వేక్షన్‌లో 10 స్థానాల్లో నిలిచాయి.
3 వాటర్+ నగరాలు..
రాష్ట్రంలోని జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లను కేంద్ర ప్రభుత్వం వాటర్+ నగరాలుగా గుర్తించింది. వీటిలో మురుగు నీటిని శుద్ధి చేయడంతో పాటు ఆ నీటిని మళ్లీ ఉపయోగించుకునే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాయి. అలాంటి నగరాలకే వాటర్+ సిటీగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఓపెన్ డిఫకేషన్ ఫ్రీ(బహిరంగ మల విసర్జనలేని ప్రాంతం) నగరాలుగా 21 మున్సిపాలిటీలు, ఓడీఎఫ్+ 61 మున్సిపాలిటీలు, ఓడీఎఫ్++ 57 మున్సిపాలిటీలను గుర్తించారు. 142 మున్సిపాలిటీలను మూడు విభాగాల్లో గుర్తించారు.
10 వన్ స్టార్ మున్సిపాలిటీలు
తెలంగాణలోని 10 మున్సిపాలిటీలను వన్‌స్టార్‌గా గుర్తించారు. ఈ పది మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ నుంచి చెత్త ప్రాసెసింగ్ ప్రక్రియ విజయవంతంగా సాగుతోందని నిర్ధారించిన తర్వాతనే వన్ స్టార్ ర్యాంకు ఇస్తారని అధికారులు చెబుతున్నారు. వీటికంటే మెరుగ్గా ఉన్న కంటోన్మెంట్‌కు త్రీస్టార్‌గా గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీకి మాత్రమే 7స్టార్ గుర్తింపు దక్కింది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో చెత్త సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, సైంటిఫిక్ డిస్పోజల్, చెత్త నుంచి విద్యుత్ తయారీ వ్యవస్థ ఒక్క మాటలో చెప్పాలంటే స్వచ్ఛ సర్వేక్షన్ లో సూచించిన అన్ని నిబంధనలను పాటించడంతోనే 7స్టార్ దక్కిందని అధికారులు చెబుతున్నారు.
గతంలో ఇలా..
స్వచ్ఛ సర్వేక్షన్-2023, 2024 సర్వేక్షన్ మార్గదర్శకాల్లో భారీగా మార్పులు చేశారు. 2023లో 0-20 వేలు, 20 వేల నుంచి 50 వేలు, 50 వేల నుంచి లక్ష, లక్ష నుంచి 10 లక్షలు, 10 లక్షలకుపైగా జనాభా కల్గిన నగరాల జాబితాలో ర్యాంకులు ప్రకటించేవారు. దీంతో పాటు దేశ వ్యాప్తంగా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ జోన్లుగా వేర్వేరుగా అవార్డులు ఇచ్చేవారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సౌత్ కేటగిరీలో 25కుపైగా అవార్డులు దక్కేవని అధికారులు చెబుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లకు మాత్రమే ఈసారి అవార్డులు దక్కాయని విమర్శలూ లేకపోలేదు.
2025లో మెరుగైన ర్యాంకులు
స్వచ్ఛ సర్వేక్షన్-2024లో ఆశించిన స్థాయిలో ర్యాంకులు సాధించలేకపోయామని పురపాలకశాఖ అధికారులు భావిస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను అందిపుచ్చుకోలేక పోయామని, వచ్చే ఏడాదిలో మంచి ర్యాంకులతో పాటు అవార్డులు సాధించేందుకు ముందు నుంచే ప్రయత్నిస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. స్వచ్ఛ సర్వేక్షన్-2025కు సంబంధించి టూల్ కిట్‌ను అక్టోబర్2(గాంధీ జయంతి) రోజున ప్రకటించనున్నారు.






