Model Schools: తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల!

by Ramesh Naini |

రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Model Schools: తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం గత నెల ఏప్రిల్ 19వ తేదీన జరిగిన మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ మెరిట్ జాబితాను అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ మార్కులు, ర్యాంకులను తెలుసుకోవడానికి http://tgms.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

అధికారుల సమాచారం ప్రకారం.. ఈ ఏడాది మొత్తం 37,216 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 30,545 మంది పరీక్షకు హాజరయ్యారు. కేవలం 6,671 మంది మాత్రమే పరీక్షకు గైర్హాజరయ్యారు. తరగతుల వారీగా హాజరైన వారిలో 6వ తరగతి విద్యార్థులు 19,563 మంది, 7 వ తరగతికి 4282 మంది, 8 వ తరగతికి 3908 మంది, 9 వ తరగతికి 2313 మంది, పదో తరగతికి 479 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం కేవలం మెరిట్ జాబితాను మాత్రమే విడుదల చేశారు. తుది ఎంపిక ప్రక్రియ, సీట్ల కేటాయింపు అనేది రిజర్వేషన్ నిబంధనలు, ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం సంబంధిత మోడల్ స్కూల్ స్థాయిలో జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన తదుపరి షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడించనున్నారు.

Next Story