ముంచేసిన వర్షం.. వరద బాధితులకు మంత్రుల అభయహస్తం

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, నిర్మల్ ​జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. దాదాపుగా 40కి పైగా సెంటీమీటర్ల వర్షపాతం మేర వర్షం కురవడంతో పలు జిల్లాలు అతాలకుతలం అయ్యాయి.

ముంచేసిన వర్షం.. వరద బాధితులకు మంత్రుల అభయహస్తం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, నిర్మల్​జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. దాదాపుగా 40కి పైగా సెంటీమీటర్ల వర్షపాతం మేర వర్షం కురవడంతో పలు జిల్లాలు అతాలకుతలం అయ్యాయి. జనజీవనం స్తంభించింది. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. దీంతో వీరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నారు. వరదల్లో చిక్కుకున్న, తీవ్ర నష్టపోయిన ప్రజలకు ధైర్యం చెప్పారు. వారికి భరోసా కల్పించారు. మేము ఉన్నామంటూ చెబుతూనే అధికారులు, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్​ బృందాల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.

సీఎం రేవంత్ పర్యటన..

వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పర్యటించారు. హెలికాప్టర్​ద్వారా భారీవర్షాలు, వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్​సర్వే నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ గోదావరి నదికి పూజలు చేశారు. వర్షాల ద్వారా వస్తున్న వరద ప్రవాహం, నియంత్రణను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి కామారెడ్డి, మెదక్​ జిల్లాల్లో ఏరియల్​సర్వే నిర్వహించారు. కామారెడ్డిలో హెలికాప్టర్​ దిగడానికి అనువైన వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో మెదక్‌లో దిగి అక్కడి అధికారుల ద్వారా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణనష్టం లేకుండా చూడాలని ఆదేశించారు. రాబోయే రెండు రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలని, సాధారణ పరిస్థితులు వచ్చేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రత్యేక అధికారి హరీశ్‌ను అక్కడే ఉండాల్సిందిగా సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టులు, బ్యారేజీలు, చెరువులు నీటి నిల్వ పరిస్థితిని తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్​కుమార్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్​ గౌడ్​ ఉన్నారు.

కామారెడ్డిలో మంత్రి సీతక్క పర్యటన..

కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ఆ జిల్లాల్లో పర్యటించారు. వరద బాధిత ప్రాంత ప్రజలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ, ఎంపీ సురేశ్​ షెట్కార్లలతో కలిసి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా కామారెడ్డి, అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు. బీభత్సమైన పరిస్థితి ఏర్పడిందని, జాతీయ రహదారులు కొట్టుకపోవడం, ఇళ్లలో మొదటి అంతస్తు వరకు నీళ్లు రావడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని మీడియాకు వివరించారు. ఆ తర్వాత కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో ఆమె సమీక్షించారు. ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలో మంత్రి దామోదర రాజనర్సింహా స్వయంగా పర్యటించారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు. సహాయక చర్యలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇతర మంత్రులు సైతం..

వరద బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, శ్రీధర్​బాబు, జూపల్లి కృష్ణారావు, వివేక్​ వెంకటస్వామి తదితరులు పర్యవేక్షించడమే కాకుండా అధికారులతో మాట్లాడి సహాయకచర్యలపై సమీక్షించారు. ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. వీరితో పాటుగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు.

సిరిసిల్లలో కేంద్రమంత్రి బండి..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​గత రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీ వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేపట్టారు. కేంద్ర రక్షణ శాఖ నుంచి రాష్ట్రానికి సైనిక హెలికాఫ్టర్లు కేటాయించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్​సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడి మూడు సైనిక హెలికాఫ్టర్లు కేటాయించేలా చూశారు. దీంతో పాటుగా తన పార్లమెంట్ నియోజక పరిధిలో కేంద్రమంత్రి బండి తన అనుచరులతో కలిసి పర్యటించారు. ఆయన వెంట జిల్లా అధికారులు సైతం ఉన్నారు. ముంపు బాధిత ప్రజలను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. అధికారుల ద్వారా తాజా సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

క్షేత్రస్థాయిలో కేటీఆర్, హరీశ్ రావులు సైతం

బీఆర్‌ఎస్​నేతలు, మాజీ మంత్రులు కే తారక రామారావు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ వర్షాలు, వరదల్లో చిక్కుకున్న ప్రజలను కలిసి మాట్లాడారు. వారి ఇబ్బందులు, స్థానికంగా ఉన్న పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం కామారెడ్డిలో పర్యటించారు. మరో బీఆర్‌ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్​రావు భారీ వర్షాలకు అత్యధికంగా దెబ్బతిన్న మెదక్​ నియోజకవర్గంలో పర్యటించారు. ఆయనతో పాటుగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డి ఉన్నారు. వరదలకు స్థానికంగా జరిగిన డ్యామేజీపై అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. కోమటి చెరువు ప్రాంతంలోనూ ఆయన విసృతంగా పర్యటించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. స్థానిక ఎన్నికలకు ముందు అధికార, ప్రతిపక్షం అనే తేడా నాయకులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకోవడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో పార్టీల నేతలు వచ్చే లోకల్ పోరులో తమకు మైలేజ్ చేకూరుతుందని ఎవరికివారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story