గనుల అక్రమాలపై ఉక్కుపాదం.. సీఐడీ విచారణకు సర్కారు ఆదేశం

by Naga Rani Yarlagadda |

తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై సర్కారు కొరడా ఝుళిపిస్తోంది.

గనుల అక్రమాలపై ఉక్కుపాదం.. సీఐడీ విచారణకు సర్కారు ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై సర్కారు కొరడా ఝుళిపిస్తోంది. నిబంధనలు తుంగలో తొక్కి రూ.100 కోట్లు ఖజానాకు నష్టం కలిగించడంపై సీరియస్‌గా ఉంది. గనుల శాఖ ఇచ్చిన నివేదికను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. ఈ కుంభకోణంపై విచారణను సీఐడీకి అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు, అక్రమాలకు పాల్పడిన 6 బడా గ్రానైట్ సంస్థలతోపాటు ఓఆర్‌ఆర్ సమీపంలోని క్రషింగ్ యూనిట్ల నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

అక్రమాలపై విచారణ

అక్రమ మైనింగ్, అనుమతుల్లేని క్రషింగ్ యూనిట్ల నిర్వహణపై గత అసెంబ్లీ సమావేశాల్లో తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన గనుల అక్రమాలపై విచారణకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించారు. దర్యాప్తునకు అవసరమైన పూర్తి వివరాలను సీఐడీకి పంపాలని మైనింగ్ శాఖను ఆదేశించారు. మైనింగ్, విజిలెన్స్ విభాగాలు సంయుక్తంగా జరిపిన అంతర్గత విచారణలో మైనింగ్ మాఫియా బాగోతం బట్టబయలైంది. కరీంనగర్, పెద్దపల్లి, గంగాధర, రాఘవపురం, ఉప్పల్, జగిత్యాల, నాగర్‌కర్నూల్, ఖమ్మం ప్రాంతాల్లో భారీగా అక్రమ మైనింగ్ జరిగినట్లు విజిలెన్స్ నివేదిక కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు సీఐడీ దర్యాప్తు కోసం సమగ్ర వివరాలను, ఫైళ్లను అప్పగించింది.

ఖజానాకు తీవ్ర నష్టం

కరీంనగర్‌కు చెందిన కొన్ని బడా సంస్థలు పర్మిట్ లేకుండా ఏకంగా 7,68,889 క్యూబిక్ మీటర్ల కలర్ గ్రానైట్ బ్లాకులను కాకినాడ పోర్టుకు తరలించి, అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేశాయని నివేదికలో వెల్లడైంది. రవాణా చేసిన దాన్ని రికార్డుల్లో తక్కువగా చూపించడంతో ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని తేల్చారు. ఈ విధంగా మొత్తం ఎనిమిది సంస్థలు రూ.124.94 కోట్ల మేర సీనరేజి ఫీజును ఎగ్గొట్టాయని, దానికి 5 రెట్లు ఫెనాల్టీ వేస్తే, ఈ సంస్థల నుంచి ప్రభుత్వానికి ఏకంగా రూ.749.66 కోట్లు వసూలు కావాల్సి ఉందని సీఐడీకి ఇచ్చిన నివేదికలో మైనింగ్ శాఖ స్పష్టం చేసింది. డిమాండ్ నోటీసులు ఇచ్చినా ఇప్పటివరకు కోట్ల రూపాయల రాయల్టీ చెల్లించని సంస్థలపై, తప్పుడు పత్రాలతో రవాణా చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.

ఇష్టారాజ్యంగా క్రషింగ్..

మరోవైపు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల 2020 నుంచి 2024 మధ్య కాలంలో ఏకంగా 30కి పైగా క్రషింగ్ యూనిట్లు నిబంధనలకు విరుద్ధంగా నడిచాయని అధికారులు గుర్తించారు. వీటిలో ఎక్కువ భాగం మైనింగ్ లేదా కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా నడిచాయని తేల్చారు. ఆ తర్వాత అధికారుల తనిఖీల్లో 20కి పైగా యూనిట్లను ధ్వంసం చేశామని, అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని సీఐడీకి నివేదించారు. వీటికి తోడు నేరెళ్ల రాజన్న సిరిసిల్ల శాండ్ మైనింగ్ కేసు, అక్రమంగా లీజులు బదిలీ చేయడం, లీజు పరిధిని దాటి తవ్వకాలు జరపడం తదితర ఫిర్యాదులన్నింటినీ సీఐడీ దర్యాప్తునకు అప్పగించారు. 2022లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ఇచ్చిన సమన్లు, అప్పట్లో కరీంనగర్ మైనింగ్ ఏడీ ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్ వివరాలనూ జతచేశారు.

ఏళ్ల తరబడి అక్రమ తవ్వకాలు

ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి నివేదిక అందడంతో సీఐడీ దర్యాప్తు అధికారులు దాడులకు సన్నద్ధమవుతున్నారు. అప్పట్లో ఈ లీజులు మంజూరు చేసిన గనుల శాఖ ఉన్నతాధికారులు, అక్రమాలకు పాల్పడిన మైనింగ్ కంపెనీల యజమానులు, క్రషింగ్ యూనిట్ల నిర్వాహకులకు త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి సాగిన ఈ అక్రమ తవ్వకాల వెనుక వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే, వారి అండదండలతోనే ఈ దందా సాగినట్లు తెలుస్తోంది. సీఐడీ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూసే అవకాశముంది.

Next Story