- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టైఫండ్, బకాయిల జాప్యంపై తెలంగాణ మెడికోల ఆందోళన
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా ఆసుపత్రుల్లో పని చేస్తున్న జూనియర్ డాక్టర్లకు సంబంధించిన జనవరి 2025 నుంచి జూన్ వరకు చెల్లించాల్సిన స్టైఫండ్, బకాయిల విడుదలలో జాప్యం జరుగుతోందని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా ఆసుపత్రుల్లో పని చేస్తున్న జూనియర్ డాక్టర్లకు సంబంధించిన జనవరి 2025 నుంచి జూన్ వరకు చెల్లించాల్సిన స్టైఫండ్, బకాయిల విడుదలలో జాప్యం జరుగుతోందని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ, సంబంధిత బిల్లులు అన్ని విధివిధానాలు పూర్తి చేసి శాఖ స్థాయిలో ఆమోదం పొందినప్పటికీ, ప్రభుత్వ తుది అనుమతులు లేకపోవడంతో ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదని పేర్కొంది. ప్రభుత్వ ఆరోగ్య సేవల వ్యవస్థలో జూనియర్ డాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, బోధనా ఆసుపత్రుల్లో నిరంతరం కఠిన పరిస్థితుల్లో సేవలందిస్తున్న సమయంలో వారికి రావాల్సిన న్యాయమైన చెల్లింపులు ఆలస్యం కావడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపింది.
ఈ జాప్యంతో మానసిక స్థైర్యం, అకడమిక్ కార్యకలాపాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించింది. జూన్ 2025 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ప్రభుత్వానికి వినతులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆలస్యం కొనసాగితే 2021 బ్యాచ్ పీజీ డాక్టర్లు (ప్రస్తుతం సీనియర్ రెసిడెంట్లు), 2022 బ్యాచ్ పీజీ డాక్టర్లు, హౌస్ సర్జన్లు, సూపర్ స్పెషాలిటీ పీజీ డాక్టర్లకు రావాల్సిన బకాయిలపై అనిశ్చితి ఏర్పడుతుందని హెచ్చరించింది. జనవరి–జూన్ 2025 కాలానికి సంబంధించిన అన్ని పెండింగ్ బిల్లులకు తక్షణమే ప్రభుత్వ ఆమోదం ఇచ్చి, బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సమస్య పరిష్కారం కాకపోతే జూనియర్ డాక్టర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అదే సమయంలో, తెలంగాణలో వైద్య విద్య, ప్రభుత్వ ఆరోగ్య సేవల బలోపేతానికి ప్రభుత్వం తోడుగా నిర్మాణాత్మక చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది.






