- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షయ రహిత రాష్ట్రంగా తెలంగాణ అడుగులు.. కేసుల నిర్మూలనలో భేష్
క్షయ (టీబీ) వ్యాధి నియంత్రణలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశాన్ని పట్టిపీడిస్తున్న క్షయ (TG) రక్కసిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా టీబీని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకోగా, భారత్ మాత్రం అంతకంటే ముందే ఈ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదికల ప్రకారం దేశంలో టీబీ కేసుల తగ్గుదల రేటు ప్రపంచ సగటు కంటే రెట్టింపు వేగంతో ఉండటం విశేషం. ఇక టీబీ నియంత్రణలో తెలంగాణ అత్యుత్తమంగా పని చేస్తున్నది. దేశంలో నమోదైన టీబీ కేసుల్లో తెలంగాణ 11వ స్థానంలో ఉంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు టీబీ నియంత్రణలో ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ముందున్న తెలంగాణ
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం 2025లో తెలంగాణలో మొత్తం 86,187 టీబీ కేసులు నమోదయ్యాయి. జాతీయ స్థాయిలో అత్యధిక కేసులున్న రాష్ట్రాల్లో తెలంగాణ 11వ స్థానంలో ఉంది. అయితే, దక్షిణాది రాష్ట్రాల మధ్య పోలికను చూస్తే మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు 93,511 కేసులతో మొదటి స్థానంలో ఉంది. ఇక కేరళ 19,385 కేసులతో టీబీ నియంత్రణలో ముందుంది. అయితే దేశంలోనే అత్యధిక టీబీ కేసులు మాత్రం ఉత్తరాదిలోనే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో 7 లక్షలకు పైగా కేసులతో పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. మహారాష్ట్ర, బిహార్, మధ్యప్రదేశ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనూ లక్షకు మించిన కేసులు లేకపోవడం విశేషం. ఇక కేసుల నమోదు అతి తక్కువగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలుగా లక్షద్వీప్ (15), లడఖ్ (281), అండమాన్ అండ్ నికోబార్ దీవులు (531) నిలిచాయి.
నిధుల వినియోగంలోనూ..
టీబీ నియంత్రణకు కేంద్రం కేటాయిస్తున్న నిధులను ఖర్చు చేయడంలో తెలంగాణ అత్యంత చురుగ్గా వ్యవహరిస్తున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రూ. 113.59 కోట్లు కేటాయించగా, జనవరి 2026 నాటికే అందులో రూ. 100.17 కోట్లను (దాదాపు 88శాతం) నివారణ చర్యల కోసం వినియోగించారు. ఆంధ్రప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే నిధుల వినియోగంలో తెలంగాణ వేగంగా ఉన్నది. కేవలం వైద్యమే కాకుండా, బాధితులకు పౌష్టికాహారం అందించేందుకు నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా ప్రతి టీబీ రోగికి నెలకు రూ. 1,000 చొప్పున సహాయం అందిస్తున్నారు. తెలంగాణలో ఈ పథకం కింద 2024లో రూ. 9.08 కోట్లు, 2025లో రూ. 0.96 కోట్లు ఖర్చు చేశారు. ఉచిత పరీక్షలు, గ్రామాల్లో మొబైల్ డయాగ్నోస్టిక్ యూనిట్లు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా స్క్రీనింగ్ పెంచుతూ తెలంగాణను క్షయ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది.
జాతీయ స్థాయిలో తగ్గుదల రేటు.. ఆశాజనకం!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2025 ప్రకారం.. భారతదేశంలో టీబీ వ్యాప్తి గణనీయంగా తగ్గుతున్నది. 21శాతం తగ్గుదలతో ప్రపంచ సగటు తగ్గుదల కంటే మెరుగ్గా ఉంది. దేశంలో 2015లో ప్రతి లక్ష జనాభాకు 237 కేసులు ఉండగా, 2024 నాటికి ఇది 187కు తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా తగ్గుదల రేటు 12శాతం మాత్రమే అయితే భారత్ 21శాతం సాధించి రికార్డు సృష్టించింది.






