TG: స్థానిక ఎన్నికల అప్డేట్.. భారీగా తగ్గబోతున్న ఎంపీటీసీల సంఖ్య!

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీ రాజ్ శాఖ తుది జాబితా ఖరారు చేసింది.

TG: స్థానిక ఎన్నికల అప్డేట్.. భారీగా తగ్గబోతున్న ఎంపీటీసీల సంఖ్య!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీ రాజ్ శాఖ తుది జాబితా ఖరారు చేసింది. ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల అమలుకు అవసరమైన కసరత్తులో భాగంగా ఈ ప్రక్రియకు తుది రూపు ఇచ్చే పనిలో ఆ శాఖ సిద్ధమైంది. వీటితో పాటు ఎంపీటీసీల స్థానాల సంఖ్య సైతం ఫైనల్ చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటి వరకు తెలంగాణలో 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య తగ్గుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, కార్పొరేషన్​సమీపంలోని గ్రామాలను వాటిలో విలీనం చేయడం, మేడ్చల్​జిల్లా మొత్తాన్ని అర్బన్​ప్రాంతంగా మార్చడం, ఔటర్ రింగ్ రోడ్డు లోపలి మండలాలన్నింటినీ మున్సిపాలిటీలుగా మార్చడంతో ఎంపీటీసీ సభ్యుల సంఖ్య తగ్గనుందని పేర్కొంటున్నారు.

566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు

2019లో 32 జిల్లా పరిషత్​చైర్మన్లు, 539 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ సారి 31 జిల్లా పరిషత్,​566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 33 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా నిజామాబాద్‌లో​31, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 26, కామారెడ్డిలో 25 స్థానాలు ఉన్నాయి. అతి తక్కువగా పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తోన్న ములుగు జిల్లాలో కేవలం 10 జెడ్పీటీసీ స్థానాలే ఉన్నాయి. ఆ తర్వాత వరంగల్‌లో 11 స్థానాలున్నాయి. రాష్ట్రంలో ఎక్కువ జిల్లాల్లో 12 నుంచి 15 మధ్యనే జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇలా పది జిల్లాలు ఉన్నట్టు అధికారుల లెక్కలను బట్టి స్పష్టమైంది.

ఒక్క సీటు అటు ఇటు అయినా...

రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్​చైర్మన్​స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ సభ్యులు వీరిని ఎన్నుకోనున్నారు. అయితే రాష్ట్రంలో పది జిల్లా పరిషత్‌లలో 12 నుంచి 15 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. దీంతో ఆరేడు స్థానాలు సాధించే పార్టీనే జెడ్పీ చైర్మన్​స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ఎస్టీ, ఎస్సీలకు రిజర్వు‌డ్​అయ్యే స్థానాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. దీంతో ఆ సామాజికి వర్గానికి చెందిన వ్యక్తి రెండు పార్టీల్లో ఉంటే ఒకే కానీ ఒకే పార్టీలో ఉంటే మెజార్టీ వచ్చినా, రాకున్నా జెడ్పీ చైర్మన్​స్థానాన్ని దక్కించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. దీంతో జెడ్పీ చైర్మన్​ఎన్నిక ఆసక్తిగా మారే అవకాశం ఉంటుంది.




Next Story