చేజారిన ఎనఎస్‌యూఐ అధ్యక్ష పదవి! వరుసగా రెండోసారి తెలంగాణ నేత అనులేఖకు నిరాశ

by Ramesh Naini |

'నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా' జాతీయ అధ్యక్ష రేసులో తెలంగాణకు చెందిన యువ నాయకురాలు అనులేఖ బూసకు తృటిలో అవకాశం చేజారింది.

చేజారిన ఎనఎస్‌యూఐ అధ్యక్ష పదవి! వరుసగా రెండోసారి తెలంగాణ నేత అనులేఖకు నిరాశ
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం 'నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా' (NSUI) జాతీయ అధ్యక్ష రేసులో తెలంగాణకు చెందిన యువ నాయకురాలు అనులేఖ బూసకు తృటిలో అవకాశం చేజారింది. తుది దశ వరకు చేరుకున్నప్పటికీ ఆమెకు వరుసగా రెండోసారి నిరాశే ఎదురైంది. అయితే, అదే సమయంలో యువ రాజకీయ నాయకులకు శిక్షణనిచ్చే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ప్రోగ్రామ్ ‘కాసిప్’ (KASIP) కు ఆమె ఎంపికవడం విశేషం.

చివరి రౌండ్‌లో చేజారిన అవకాశం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అనులేఖ.. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆమె ప్రస్తుతం ఎన్ఎస్‌యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేరళ రాష్ట్ర ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. గతంలో రాహుల్‌గాంధీతో కలిసి 'భారత్ జోడో యాత్ర'లోనూ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. జాతీయ అధ్యక్ష పదవి కోసం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల 15 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన తుది రౌండ్‌ ఇంటర్వ్యూలో ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేయగా, అందులో అనులేఖ స్థానం దక్కించుకున్నారు. ఆమెకు మహిళా, ఓబీసీ కోటా కింద అధ్యక్ష పదవి దక్కుతుందని అందరూ భావించినప్పటికీ.. కాంగ్రెస్ అధిష్టానం రాజస్థాన్‌కు చెందిన దళిత నేత వినోద్ జఖాడ్‌ వైపు మొగ్గుచూపింది. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున, రాష్ట్రంలో ఆమెకు తగిన సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

అంతర్జాతీయ వేదికపై అరుదైన అవకాశం..

ఒకవైపు ఎన్ఎస్‌యూఐ పదవి చేజారినా, అనులేఖకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం వరించింది. రాజకీయ నాయకత్వ లక్షణాలు, ప్రజాహిత విధానాల రూపకల్పన, ప్రజాస్వామ్య విలువలపై శిక్షణనిచ్చే 'కొన్రాడ్ అడెనౌర్ స్కూల్ ఫర్ యంగ్ పొలిటీషియన్స్' (KASIP) ప్రోగ్రామ్‌కు ఆమె ఎంపికయ్యారు. ఆసియా దేశాల యువ నాయకులకు నిర్వహించే ఈ కార్యక్రమానికి భారతదేశం నుంచి కేవలం ముగ్గురు మాత్రమే ఎంపికయ్యారు. వారిలో ఇద్దరు బీజేపీకి చెందిన వారు కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన ఏకైక నాయకురాలు అనులేఖ కావడం గమనార్హం. ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ప్రజాస్వామ్య పరిపాలన, రాజకీయ సంస్థల బలోపేతం వంటి కీలక అంశాలపై యువ నాయకులకు అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం అనులేఖ శ్రీలంక, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో పర్యటించనున్నారు. తొలి విడతలో భాగంగా ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ఫిలిప్పీన్స్‌లో జరగనున్న ప్రోగ్రామ్‌కు ఆమె హాజరుకానున్నారు.

Next Story