- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో హ్యామ్ రోడ్ల పనులకు శ్రీకారం.. రూ.13,006 కోట్లతో 6,092 కి.మీ రోడ్ల విస్తరణ
రాష్ట్రంలో రహదారుల నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) పనులకు ముహూర్తం ఖరారైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రహదారుల నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) పనులకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ ఆధ్వర్యంలో మొత్తం 6,092.37 కిలోమీటర్ల మేర 441 రోడ్లను విస్తరించనున్నారు. ఇందుకోసం రూ. 13,006.27 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేయగా, పనుల నిర్వహణ కోసం మొత్తం ప్రాజెక్టును 34 ప్యాకేజీలుగా విభజించారు.
నేడు శంకుస్థాపన
ఈ మెగా ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవానికి వేదిక ఖరారైంది. నేడు నల్గొండ జిల్లాలోని కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని హ్యామ్ పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ఆర్అండ్‌బీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
5 శాతానికే పరిమితం
ఈ హ్యామ్ టెండర్ల ప్రక్రియ గత రెండు నెలలుగా తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగింది. ఎక్సెస్ కోట్ ధరలపై కాంట్రాక్టర్ల మధ్య నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏకంగా 50 శాతం నుంచి 75 శాతం వరకు ఎక్సెస్ ధరలను కాంట్రాక్టర్లు కోట్ చేయడంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ప్యాకేజీల మొత్తం అంచనాల్లో 5 శాతం ఎక్సెస్ కు మించకుండా పనులు జరగాలని మంత్రివర్గం ఇటీవల స్పష్టమైన షరతు విధించింది. ప్రభుత్వం విధించిన ఈ నిబంధనకు చివరకు కాంట్రాక్టర్లు అంగీకరించడంతో టెండర్ల పీటముడి వీడింది.
60 శాతం బ్యాంకు రుణాలు
నిర్మాణానికి కావాల్సిన నిధులలో 60 శాతం వాటాను కాంట్రాక్టర్లు బ్యాంకు రుణాల ద్వారానే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ లోన్ ప్రక్రియలు, మిగిలిన ఫార్మాలిటీస్ పూర్తి కావడానికి కనీసం 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్యాకేజీల పనులు పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రారంభం కావడానికి మరికొంత సమయం పడుతుందని ఆర్అండ్‌బీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గ్రామీణ రవాణా ముఖచిత్రం పూర్తిగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రోడ్లను నేషనల్ హైవేస్ తరహాలో ఆర్‌అండ్‌బీ పరిధిలో డీబీఎం పద్ధతిలో, పంచాయతీరాజ్ పరిధిలో బీఎం పద్ధతిలో అత్యంత నాణ్యతతో నిర్మిస్తున్నారు. ఈ విధానం వల్ల రహదారులు భారీ బరువులను తట్టుకుని, 15 ఏళ్ల పాటు ఎలాంటి గుంతలు లేకుండా మన్నికగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.






