‘స్టార్టప్ ఇండియా’లో దూసుకుపోతున్న తెలంగాణ

by Muthe.Rajitha |

భారత్‌లో శక్తిమంతమైన స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జనవరి 16, 2016న స్టార్టప్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టింది.

‘స్టార్టప్ ఇండియా’లో దూసుకుపోతున్న తెలంగాణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : భారత్‌లో శక్తిమంతమైన స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జనవరి 16, 2016న స్టార్టప్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలో అత్యంత ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పెద్ద ఎత్తున యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫలితంగా నూతన స్టార్టప్‌లకు దేశంలో ఇతర ప్రాంతాల కన్నా తెలంగాణలోని హైదరాబాద్ ప్రముఖ కేంద్రంగా మారింది. నవంబర్ 30, 2024 నాటికి మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1,54,719 స్టార్టప్‌లను స్థాపించారు. గుర్తింపు పొందిన స్టార్టప్‌లలో అత్యధికంగా 48 % మంది కనీసం ఒక మహిళా డైరెక్టర్‌‌ను కలిగి ఉన్నారు. ఈ స్టార్టప్‌లు 17 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించాయి. 27,459 స్టార్టప్‌లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ (15,851), కర్ణాటక (16,335) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

పారిశ్రామికవేత్తల చూపు తెలంగాణ వైపు

ప్రస్తుతం తెలంగాణలో స్టార్టప్‌ల స్థాపనకు అనూకూల వాతావరణం ఉండటంతో చాలా మంది యువ పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారు. స్టార్టప్ రన్‌వే, నేషనల్ మెంటర్‌షిప్ ప్లాట్‌ఫాం, సీడ్ ఫండ్ సపోర్ట్, స్టార్టప్‌ల ఫండ్స్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్), స్టార్టప్ ఇండియా యాత్ర, స్టార్టప్ మహా‌కుంభ్ 2024, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ వంటి కార్యక్రమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం యువతకు అవకాశాలను కల్పిస్తోంది. మహాకుంభ్ 2025 పేరుతో పర్యావరణ వ్యవస్థను పరిరక్షించే విధంగా స్టార్టప్ ఐడియాస్‌తో ముందుకొచ్చే వారి ద్వారా ప్రపంచస్థాయిలో స్టార్టప్ అనూకూల వాతావరణానికి భారత్ సిద్ధంగా ఉందని సంకేతాలను కేంద్రం పంపిస్తోంది. దీని ద్వారా గ్లోబల్ రీచ్‌ను సాధించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది.

సక్సెస్ ఫుల్ తెలంగాణ స్టార్టప్‌లు

తెలంగాణ‌లో స్థాపించిన పలు స్టార్టప్‌లు విజయవంతంగా తమ ప్రస్థానానాన్ని కొనసాగిస్తున్నాయి. యాక్సెల్ ఏరో ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ అనతి కాలంలోనే అద్భుతమైన విజయాలను సాధించి యువతలో స్ఫూర్తిని నింపింది. సైనిక, వాణిజ్య రంగాల్లో ఎన్నో సేవలు అందిస్తూ నూతన ఆవిష్కరణలను చేసింది. ఏరో యాక్సెల్ సైనిక రంగంలో వినూత్న ఆవిష్కరణలు, ప్రయోగాలను గుర్తించిన భారత ప్రభుత్వం 2023 ఏరో ఇన్నోవేట్ కేటగిరీలో అవార్డును అందజేసింది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ రంగంలో దూసుకుపోతోంది. స్కైరూట్ ఏరోస్పేస్ విజయానికి ప్రభుత్వం నుంచి సీడ్ ఫండింగ్, భాస్కర్ వేదికలు ఎంతగానో సహకారాన్ని అందించాయి. తెలంగాణ కేంద్రంగా పని చేస్తున్న ఆటోక్రసీ స్టార్టప్ కంపెనీ మెషినరీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో ప్రత్యేక పరికరాలను అభివృద్ధి చేయడంతో పాటు వ్యవసాయ రంగాన్ని మరింత సులభతరం చేసేందుకు పాటుపడుతోంది.

అన్ని రంగాల్లో స్టార్టప్‌ల హైక్

యూనికార్న్‌ల సంఖ్య 2016లో 11 నుంచి 2024 నాటికి 118కి పెరిగింది. ఐటీ సేవల రంగంలో 17,618 స్టార్టప్‌లు, హెల్త్ కేర్, లైఫ్ సైన్స్ 14,285, విద్యారంగానికి సంబంధించి 9,047 స్టార్టప్‌ల వృద్ధి రేటు గరిష్ట స్థాయికి చేరుకుంది. జేమ్ స్టార్టప్ రన్ వే ద్వారా 27,574 స్టార్టప్ ఆన్‌బోర్డులోకి వచ్చాయి. వీటి విలువ దాదాపుగా రూ.32 వేల కోట్లుగా ఉంది. నేషనల్ మెంటార్ షిప్ ప్లాట్ ఫాం ద్వారా 2024, నాటికి 1,749గా ఉన్న మెంటార్‌లతో 3,022 స్టార్టప్‌లు కొత్తగా నమోదు అయ్యాయి. సీడ్ ఫండ్ సపోర్ట్, ఇంక్యూబేటర్లకు రూ.902.74 కోట్ల ద్వారా కొత్తగా 2,583 స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను మొదలుపెట్టాయి. స్టార్టప్ బ్రిడ్జ్‌ ద్వారా భారతీయ స్టార్టప్‌లను ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానించేందుకు 21 దేశాలతో ఈ కార్యక్రమాన్ని కేంద్రం రూపొందించింది. ‘పిచ్ ఫార్వర్డ్’ ద్వారా మహిళలకు మద్దతుగా నిలుస్తూ వివిధవర్క్ షాపులను నిర్వహించింది. దీని ద్వారా 22 రాష్ట్రాల్లోని 1,400లకు పైగా మహిళా స్టార్టప్ వ్యవస్థాపకులు ప్రభావితమయ్యారు.

Next Story