కాన్స్ ఫెస్టివల్‌లో తెలంగాణ ఇక్కత్.. చేనేత వస్త్రాలతో అదరగొట్టిన రష్మీ ఠాకూర్

by Gantepaka Srikanth |

భారతీయ వస్త్ర పరిశ్రమకు మైలురాయిగా తెలంగాణ ఉత్పత్తులు నిలిచాయి. 79వ కాన్స్ ఫెస్టివల్‌లో మిస్ ఏషియా ఇంటర్నేషనల్, తెలంగాణ ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ చారిత్రాత్మక అరంగేట్రం చేశారు.

కాన్స్ ఫెస్టివల్‌లో తెలంగాణ ఇక్కత్.. చేనేత వస్త్రాలతో అదరగొట్టిన రష్మీ ఠాకూర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారతీయ వస్త్ర పరిశ్రమకు మైలురాయిగా తెలంగాణ ఉత్పత్తులు నిలిచాయి. 79వ కాన్స్ ఫెస్టివల్‌లో మిస్ ఏషియా ఇంటర్నేషనల్, తెలంగాణ ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ చారిత్రాత్మక అరంగేట్రం చేశారు. భారతదేశానికి సాంస్కృతిక రాయబారిగా ఆమె ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా ఆమె కాన్స్ ఫెస్టివల్‌లో భారతీయ చేనేత వస్త్రాలు, హైదరాబాద్ ముత్యాలను ప్రదర్శించడం విశేషం. తెలంగాణలోని నిపుణులైన చేనేత కార్మికులు చేసిన 200 ఏళ్ల పురాతన పోచంపల్లి ఇక్కత్ తో రూపొందించిన ఒక కౌచర్ దుస్తులను ప్రదర్శించారు. ఈ అపురూప దృశ్యం "పోచంపల్లి టు కాన్స్" అనే థీమ్‌ గా కొనియాడారు. భారతదేశానికి భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఉన్న చేనేతను తెలంగాణ మగ్గాల ఉత్పత్తి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలన చిత్రోత్సవానికి తీసుకువెళ్లారు. ఇక్కత్ చేనేతలోని క్లిష్టమైన ప్రక్రియ. అలాగే నిజాంల పురాతన ఆభరణాలైన విశిష్టమైన హైదరాబాదీ ముత్యాలు అలంకరణకు మరింత శోభను చేకూర్చింది.

ఓ వైపు తెలంగాణ చేనేత ఇక్కత్ వస్త్రం, మరో వైపు హైదరాబాద్ ముత్యాల వల్ల భారతదేశ వస్త్ర, రాచరిక ఆభరణాల చరిత్రను తెలిపినట్లయ్యింది. కేన్స్ నుంచి రష్మీ ఠాకూర్ మాట్లాడుతూ.. “రెడ్ కార్పెట్‌పై నడవడం కేవలం తన వ్యక్తిగతం కాదు, ఇది తెలంగాణ ప్రాంత ఉనికిగా కొనియాడారు. అలాగే 200 ఏళ్ల చరిత్రను దారాలలో ఇమిడ్చిన పోచంపల్లిలోని ప్రతి చేనేత కార్మికుడిది అని అన్నారు. చేనేత వస్త్రాలను హైదరాబాదీ ముత్యాలతో జత చేయడం దేశ హస్తకళ నైపుణ్యాన్ని గుర్తు చేస్తుందన్నారు. హైదరాబాద్‌లోని చేనేత కార్మికుల సేవా కేంద్రం అధికారి అరుణ్ కుమార్, పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌ ప్రతినిధి తడక రమేష్ లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 79వ ఫెస్టివల్ డి కేన్స్ మే 13 నుంచి 24 వరకు జరుగుతుంది.


ఠాకూర్‌కి ధన్యవాదాలు: తడక రమేష్

ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ భారతీయ చేనేత వస్త్రాలను, హైదరాబాదీ ముత్యాలను ప్రపంచ దేశాలకు ప్రతినిధుల ముందు ప్రదర్శించడం సంతోషంగా ఉందని జాతీయ చేనేత అవార్డు గ్రహీత తడక రమేష్ అన్నారు. గ్లోబల్ ప్రపంచ వేదికైన క్యాన్ ఫిలిం ఫెస్టివల్ లో ఇక్కత్ చేనేత వస్త్రాలను ప్రదర్శించడంతో పాటు వాటికి ప్రపంచ స్థాయి ప్రచారం కల్పిస్తున్న రష్మీ ఠాకూర్ కి చేనేత కళాకారుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story