- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Indiramma Indlu: కఠినంగా వ్యవహరించడం కాదు.. కచ్చితంగా శిక్షిస్తాం: ఎండీ వీపీ గౌతం హెచ్చరిక
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని.. జైలు శిక్ష తప్పదని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం హెచ్చరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని.. జైలు శిక్ష తప్పదని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం హెచ్చరించారు. హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు, డిప్యూటీ ఇంజినీర్లతో ఇందిరమ్మ పథకం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.వెయ్యి కోట్లు అందజేశామని చెప్పారు. ఇంతవరకు 2.04 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం కాగా.. వాటిలో లక్ష ఇళ్లు బేస్‌మెంట్ స్థాయికి చేరుకున్నాయని వెల్లడించారు. మూడు నెలల్లోనే 2 లక్షలకు పైగా ఇళ్ల పనులు ప్రారంభం కావడం, గృహ నిర్మాణ కార్యక్రమాలకు ప్రభుత్వం ఇస్తున్న అత్యంత ప్రాధాన్యతకు నిదర్శనమని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా పీడీలు, డీఈఈలు నిరంతరం క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సూచించారు. దీనివల్ల పథకం అమలులో లోటుపాట్లపై అధికారులకు స్పష్టమైన అవగాహన వస్తుందని, సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. ముఖ్యంగా డీఈఈలు తమకు నిర్దేశించిన విధులను సక్రమంగా, సమర్థంగా నిర్వహించాలని ఆయన సూచించారు. లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు విడుదల అయ్యేలా చూడటంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ఇటీవల కాలంలో బిల్లుల విడుదలకు సంబంధించి కొంత మంది డబ్బులు డిమాండ్ చేసిన ఉదంతాలను ప్రస్తావిస్తూ ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలే కాకుండా కేసును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి అప్పగించి విచారణ జరిపిస్తామని ఎండీ గౌతం స్పష్టం చేశారు. బిల్లుల కోసం ప్రభుత్వ సిబ్బంది ఎవరికీ లంచాలు ఇవ్వవద్దని సూచించారు. ఈ మేరకు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ లబ్ధిదారులను చైతన్యవంతులను చేయాలని అధికారులను ఆదేశించారు.
లబ్ధిదారులే ఫొటోలు అప్‌లోడ్ చేయవచ్చు..
ఇందిరమ్మ ఇండ్ల పనులకు సంబంధించిన పురోగతి, బిల్లుల విడుదలకు అవసరమైన ఫొటోలను ఆయా గ్రామ కార్యదర్శులు కాకుండా, నేరుగా లబ్ధిదారులే అప్‌లోడ్ చేసే సదుపాయం ఇందిరమ్మ ఇండ్లు యాప్‌లో ఉన్నదని, దీనిపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఎండీ అధికారులను ఆదేశించారు. అనేక గ్రామాల్లో ఆయ గ్రామ కార్యదర్శులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఫొటోలు తీయడం, వాటిని యాప్‌లో అప్‌లోడ్ చేయడంలో జాప్యం జరుగుతున్న అంశాన్ని గుర్తించామని.. ఈ సమస్యను పరిష్కరించడంతోపాటు గ్రామ కార్యదర్శులు, ఇతర సిబ్బంది కావాలనే ఆలస్యం చేస్తున్న వాటికి అడ్డుకట్ట వేయడానికి ఇది మంచి మార్గమని వివరించారు. ఇంటి ఫొటోలను లబ్ధిదారులే స్వయంగా అప్‌లోడ్ చేసి నేరుగా అధికారులకు పంపించవచ్చన్నారు.
మెటీరియల్ తక్కువ ధరకు ఇచ్చేలా చర్యలు
ప్రతి సోమవారం బిల్లుల విడుదల చేయడంతోపాటు నిర్మాణ పనులు నిర్ణీత స్థాయి వచ్చిన తరువాత 15 రోజులోపలే బిల్లులు విడుదలయ్యేలా చూస్తున్న అంశాన్ని లబ్ధిదారులకు స్పష్టంగా చెప్పాలని ఎండీ సూచించారు. జిల్లా స్థాయిలో సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో ఇసుక, సిమెంట్, స్టీల్ ధరల నియంత్రణ కమిటీల సమావేశాలను నిర్వహించాలని, రెవెన్యూ, మండల స్థాయిలో కూడా సమావేశాలు జరపాలని నిర్దేశించారు. ఇసుక, సిమెంట్, ఇటుక తక్కువ ధరలకే లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా సమగ్ర ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హౌసింగ్‌తోపాటు ఇతర శాఖల సిబ్బంది, ఇందిరమ్మ కమిటీలు పాల్గొనేలా శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం 2 బీహెచ్‌కే ఇళ్ల మంజూరు, కేటాయింపుతోపాటు ఆయా కాలనీల్లో మంచినీరు, కరెంటు వంటి మౌలిక వసతుల కల్పన పనులపైనా సమీక్షించారు. సమావేశంలో పలు జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లతోపాటు హౌసింగ్ కార్పొరేషన్ సలహాదారు ఈశ్వరయ్య, చీఫ్ ఇంజినీర్ ఎం.చైతన్యకుమార్, సూపరింటెండింగ్ ఇంజినీర్లు వెంకటదాస్‌రెడ్డి, భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






