- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభం.. 99 రోజుల డెడ్‌లైన్
ప్రజాపాలన-ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ బోర్డు పరిధిలో పెండింగ్‌లో ఉన్న 5 వేల రిజిస్ట్రేషన్‌లను క్లియర్ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాపాలన-ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ బోర్డు పరిధిలో పెండింగ్‌లో ఉన్న 5 వేల రిజిస్ట్రేషన్‌లను క్లియర్ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజలకు పారదర్శకంగా వేగవంతమైన సేవలందించడానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు రూపొందించిన రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను మంత్రి శనివారం సచివాలయంలో ప్రారంభించారు. అలాగే తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ 99 రోజుల్లో హౌసింగ్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డ్ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.
హౌసింగ్ బోర్డ్ పరిధిలో ఇండ్లు, ఫ్లాట్లు, స్థలాలను వాయిదాల రూపంలో కొనుగోలు చేశారని.. ఇందులో కొంతమంది అసలు మరికొంతమంది వడ్డీలు చెల్లించారని.. ఇంకొంతమంది వాయిదాల గడువు ముగిసిపోయిందని.. ఇలా దాదాపు ఐదు వేల మంది తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉన్నదని వివరించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అసలు, వడ్డీ, ప్రస్తుత మార్కెట్ ధరలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. ఈ పోర్టల్ వల్ల ప్రజలు ఎవరూ అధికారుల చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదని.. పూర్తి సమాచారం పోర్టల్‌లోనే ఉంటుందన్నారు. కేటాయింపుదారులు తమ రిజిస్ట్రేషన్లు, చెల్లింపుల ధ్రువీకరణ, ఇతర లావాదేవీల పర్యవేక్షణను ఒకే వేదిక ద్వారా సులభంగా పూర్తి చేసుకోవచ్చన్నారు. డిజిటల్ విధానం వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, పౌరులకు సేవలు మరింత చేరువవుతాయని.. నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్, సీఈ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






