తెలంగాణలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-09 11:09:34  IST  )

స్థానిక సంస్థల్లో BC రిజర్వేషన్ల అమలు జీవోపై హైకోర్టు స్టే

తెలంగాణలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం.. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషనర్లకు రెండు వారాల సమయం ఇచ్చింది. ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు స్టే నిర్ణయంతో రాష్ట్రంలో ఆరు వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుంది. ఆ తర్వాత న్యాయస్థానం తీసుకోబోయే నిర్ణయంపై స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం తేలనుంది. దీంతో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ పడింది.

రెండ్రోజుల పాటు వాదనలు

బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో రెండ్రోజుల పాటు వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందన్నారు. ఇంటింటికెళ్లి సర్వే చేశారని, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత న్యాయస్థానాల జోక్యం ఉండబోదని వాదించారు. ఈ అంశాన్ని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

Next Story