వచ్చే ఏడాది చివరి నాటికి దేవాదుల పూర్తి చేయాల్సిందే : మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్

by Naga Rani Yarlagadda |

జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పనుల్లో జాప్యానికి స్వస్తి పలకాలని, నిర్ణీత గడువు లోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని రాష్ట్ర సాగునీరు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను, కాంట్రాక్ట్ ఏజెన్సీలను హెచ్చరించారు.

వచ్చే ఏడాది చివరి నాటికి దేవాదుల పూర్తి చేయాల్సిందే : మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్
X
  • యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశం
  • రూ. 18,400 కోట్లకు చేరిన ప్రాజెక్టు అంచనా వ్యయం
  • మరో రూ.3,978 కోట్ల తో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిర్ణయం
  • 2,659 ఎకరాల భూసేకరణ వేగవంతం చేయాలి
  • పనిచేయని కాంట్రాక్టర్లపై వేటు.. వెంటనే రీ-టెండర్లు
  • 38.16 టీఎంసీలతో 10 జిల్లాలోని 5.56 లక్షల ఎకరాలకు సాగునీరు

దిశ, తెలంగాణ బ్యూరో: జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పనుల్లో జాప్యానికి స్వస్తి పలకాలని, నిర్ణీత గడువు లోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని రాష్ట్ర సాగునీరు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను, కాంట్రాక్ట్ ఏజెన్సీలను హెచ్చరించారు. రూ. 18,400 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును 2027 డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో, యుద్ధప్రాతిపదికన పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. శనివారం సెక్రటేరియట్‌లోని తన చాంబర్‌లో దేవాదుల ప్రాజెక్టు పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దనసరి అనసూయ సీతక్క, ఎంపీ బలరాం నాయక్, కమాండ్ ఏరియా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, మందుల సామేల్, మురళీ నాయక్, కె. నాగరాజు, డి. మాధవరెడ్డి, జి. సత్యనారాయణ, పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీనియర్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, వ్యూహాత్మకమైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. గోదావరి నది నుండి 38.16 టీఎంసీల నీటిని తరలించి, ఉత్తర, తూర్పు తెలంగాణలోని కరవు పీడిత ప్రాంతాల్లోని 5.57 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే దీని లక్ష్యమన్నారు. హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ సహా 10 జిల్లాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

రూ. 18,400 కోట్లకు చేరిన వ్యయం

2004-05లో రూ. 6,016 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. నిర్మాణ ఖర్చులు పెరగడం, జీఎస్టీ సవరణలు, భూసేకరణ పరిహారం, ద్రవ్యోల్బణం, డిజైన్ల మార్పుల వల్ల ఇప్పుడు రూ. 18,400 కోట్లకు చేరిందని మంత్రి వివరించారు. ఇప్పటివరకు రూ. 14,422 కోట్లు ఖర్చు చేశామని, మిగిలిన పనుల కోసం మరో రూ. 3,978 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. ప్రాజెక్టులో ఇప్పటివరకు 87.70 శాతం భౌతిక పురోగతి సాధించామని, పంప్ హౌస్‌లు, పైప్‌లైన్లు, టన్నెల్ పనులు చాలా వరకు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఆసియాలోనే అతిపొడవైన 49 కిలోమీటర్ల డి-షేప్ టన్నెల్ ఉందని, సమ్మక్క బ్యారేజీ అనుసంధానం ద్వారా ఏడాది పొడవునా నీటి లభ్యత ఉంటుందని పేర్కొన్నారు.

మూడు దశల్లో.. 16 ప్యాకేజీలు

దేవాదుల ప్రాజెక్టును 3 దశల్లో 16 ప్యాకేజీల ద్వారా అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఫేజ్-1లో 1.23 లక్షల ఎకరాల ఆయకట్టు (ప్యాకేజీ-45 పూర్తయింది, ప్యాకేజీ-46 చివరి దశలో ఉంది. బొల్లికుంట వద్ద కోర్టు కేసు వల్ల 700 మీటర్ల లైనింగ్ పనులు నిలిచిపోయాయి) పనులు జరుగుతున్నాయన్నారు. ఫేజ్-2లో 1.93 లక్షల ఎకరాల ఆయకట్టు (ఆర్ఎస్ ఘనపూర్ డిస్ట్రిబ్యూటరీ సిద్ధంగా ఉంది. తపాస్‌పల్లి, అశ్వరావుపల్లి, చిట్టకోడూరు పనులు భూసేకరణ వివాదాల వల్ల ఆలస్యమవుతున్నాయి), ఫేజ్-3లో 2.39 లక్షల ఎకరాల ఆయకట్టు (ఇది అత్యంత కీలకమైనది. ప్యాకేజీ-6 పాత కాంట్రాక్టర్‌ను తొలగించి, కొత్త ఏజెన్సీకి పనులు అప్పగించాం) కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటివరకు 3.33 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించామని, సూర్యాపేట, ములుగు, వరంగల్ రూరల్, సిద్దిపేట జిల్లాల్లో మిగిలిన 2.23 లక్షల ఎకరాలకు ఆయకట్టు సృష్టించాల్సి ఉందన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన 34,622 ఎకరాలలో ఇప్పటికే 31,963 ఎకరాలు సేకరించామని, మిగిలిన 2,659 ఎకరాల భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసి నష్టపరిహారం చెల్లించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాగా, పట్టణీకరణ కారణంగా సాగుకు వీలులేకుండా పోయిన 39,651 ఎకరాలను కమాండ్ ఏరియా నుండి తొలగించేందుకు సర్వే జరుగుతోందని, 10 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు మంత్రికి వివరించారు.

పనిచేయని కాంట్రాక్టర్లపై వేటు.. రీ-టెండర్లు

నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్ల ఒప్పందాలను రద్దు చేసి, వెంటనే రీ-టెండర్లు పిలవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. "పనిచేయని కాంట్రాక్టర్ల వల్ల విలువైన సాగునీటి వసతి బ్లాక్ కాకూడదు. అడ్మినిస్ట్రేటివ్ ఆలస్యాలను సహించేది లేదు" అని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీటితో పాటు వందలాది గ్రామాలకు తాగునీరు అందుతుందని, దీనికి అవసరమైన పూర్తి నిధులు, సాంకేతిక సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.

Next Story