- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
100 నియోజకవర్గాలు.. 2.50 లక్షల ఇళ్ల నిర్మాణం
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పథకం రెండో దశ అమలు కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

- 2026-27 సంవత్సరానికి పరిపాలనా అనుమతులు
- జీవో 22 జారీ చేసిన హౌజింగ్ ఎండీ వీపీ గౌతం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పథకం రెండో దశ అమలు కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ రాష్ట్ర హౌజింగ్ ఎండీ వీపీ గౌతం జీవో 22 విడుదల చేశారు. ప్రభుత్వం ఇప్పటికే అభయహస్తం హామీలలో భాగంగా ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని 100 శాతం సబ్సిడీ రూపంలో అందిస్తున్నది. మొదటి విడతలో 3.25 లక్షల ఇండ్లను మంజూరు చేయగా.. లక్ష గృహాలు గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా.. మొదటి విడతలో రూ.6వేల కోట్లకు పైగా బిల్లులు లబ్ధిదారులకు చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ.673 కోట్లకు పైగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా అమలు చేస్తున్న ఈ పథకంలో భాగంగా రెండో విడతను ఈ నెల 1వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఆసిఫాబాద్‌లో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాడు ఉండొద్దనే లక్ష్యంతో చేపట్టిన ఈ పథకాన్ని మరింత విస్తృత పరిచేందుకు రెండో విడతకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఈ పథకాన్ని మరింత విస్తరించేందుకు రెండో దశలో కొత్త ఇళ్లతోపాటు పాత ఇళ్ల మరమ్మతులకూ అవకాశం కల్పించారు.
2.50 లక్షల ఇళ్ల లక్ష్యం
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో, జీహెచ్‌ఎంసీ పరిధిని మినహాయించి.. ప్రతీ నియోజకవర్గానికి 1,500 కొత్త ఇళ్ల చొప్పున మొత్తం 1.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. అదేవిధంగా.. పాత సెమీ-పక్కా ఇళ్లకు పైకప్పు మార్పు లేదా షెల్టర్ అప్‌గ్రేడేషన్ కోసం ప్రతీ నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున 50 వేల ఇళ్లకు సహాయం అందించనున్నారు. మరో 50 వేల ఇళ్లను రాష్ట్ర రిజర్వ్ కోటాగా కేటాయించారు. ఇందులో 30 వేల కొత్త ఇళ్లు, 20 వేల రూఫ్ రీ ప్లేస్‌మెంట్ ఇళ్లు ఉంటాయి. కాగా.. కొత్త ఇళ్ల మంజూరులో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. హట్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో అత్యంత పేద కుటుంబాలను ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు గెజిటెడ్ అధికారులతో లబ్ధిదారుల అర్హతలను పరిశీలింపజేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరిశీలన అనంతరం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రుల ఆమోదంతోనే ఇళ్ల మంజూరు ఉత్తర్వులు జారీ చేయాలని జీవోలో పేర్కొన్నారు.
కేంద్ర పథకాల అనుసంధానం
మరోవైపు.. ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పీఎంఏవై (అర్బన్), పీఎంఏవై (గ్రామీణ), పీఎం జన్‌మన్, ఎన్‌ఆర్‌ఈజీఎస్, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి పథకాలతో అనుసంధానం చేయనున్నారు. లబ్ధిదారుల వివరాలను సంబంధిత పోర్టళ్లలో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. రూఫ్ రీప్లేస్‌మెంట్ లేదా షెల్టర్ అప్‌గ్రేడేషన్ పథకం కింద పాత సెమీ-పక్కా ఇళ్లకు సహాయం అందించనున్నారు. బలమైన గోడలు, ఫౌండేషన్ ఉన్నప్పటికీ ఆస్బెస్టాస్ లేదా జీఐ షీట్లు వంటి తాత్కాలిక పైకప్పులతో ఉన్న ఇళ్లను గుర్తించి ఒక్కో ఇంటికి సుమారు రూ.2 లక్షల వరకు సహాయం అందించనున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ప్రత్యేకంగా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.






