- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ కార్మికులు మనోళ్లే.. వాళ్లను వేధించవద్దు : మంత్రి పొన్నం ఆదేశాలు

- డిపో మేనేజర్లు, అధికారుల తీరుపై సీఎం ఆగ్రహం
- వరుసగా సమావేశాలు నిర్వహించిన మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీ
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ కార్మికులపై అధికారుల వేధింపుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో శనివారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వీసీ నిర్వహించి మరీ డిపో మేనేజర్లకు కఠినమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మే1న ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఆయనను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీలో కార్మికులను డిపో మేనేజర్లు వేధింపులకు గురిచేస్తున్న అంశం సీఎం దృష్టికి వచ్చింది. ఈ అంశంపై అప్పటికే తనకు సమాచారం ఉందన్న సీఎం.. కార్మికులను వేధించే వారిపై చర్యలు తీసుకునాలని ఆదేశించినట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికులు కూడా మనోళ్లేనని... గత ఎన్నికల్లో అన్ని వర్గాలతో పాటు ఆర్టీసీ కార్మికులు సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని సీఎం పేర్కొన్నారని... కార్మిక సంఘాల నేతలు తెలిపారు. కార్మికులను ఎవరెవరు వేధిస్తున్నారో తనకు తెలుసని... అలాంటి వారి పట్ల ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలు చేయడంలో కీలకపాత్ర కార్మికులదేనని అలాంటి కార్మికులను వేధిస్తే ఊరుకోబోమని హెచ్చరించిన ఈ నేపథ్యంలోనే శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఆయన కార్మికులను వేధించకుండా చూసుకునాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఎండీ నాగిరెడ్డి సైతం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఇదే అంశంపైనా మాట్లాడినట్లు సమాచారం.
ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికుల పట్ల సానుకూల వైఖరితో వ్యవహరించాలి
- రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) అధికారులు, సిబ్బంది ప్రయాణికుల పట్ల సానుకూల వైఖరిని అవలంబించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు లేవనెత్తిన అంశాలపై మంత్రి ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు.
సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉండాలి
ఆర్టీసీలో పని చేసే డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కింది స్థాయి సిబ్బందిపై అధికారులు వేధింపు ధోరణితో కాకుండా స్నేహపూర్వక వాతావరణం లో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించకుండా, ఆప్యాయతతో, స్నేహపూర్వక వాతావరణంలో వారి ద్వారా పనులు చేయించుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. సిబ్బంది సమస్యలను నేరుగా వినేందుకు ప్రతి నెల రెండో మంగళవారం అన్ని డిపోలలో ఫిర్యాదుల పరిష్కార సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. మే 17వ తేదీలోగా అన్ని డిపోలు, బస్ స్టేషన్లలో ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచాలని డిపో మేనేజర్లను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీటి వసతి, పచ్చదనం, పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. టికెటింగ్ విషయంలో తలెత్తే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, సిబ్బందితో వాగ్వాదాలకు దిగడం సరికాదని పేర్కొన్నారు.
జూన్ నెలాఖరులోగా పెండింగ్ అంశాల పరిష్కారం
-ఎండీ వై. నాగిరెడ్డి
జూన్ నెలాఖరులోగా బస్టాండులలోని కమర్షియల్ షాపులకు సంబంధించిన పెండింగ్ అంశాలను, ఇతర పరిపాలనాపరమైన సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో సంస్థను మరింత లాభదాయకంగా, సేవా దృక్పథంతో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సిహెచ్. వెంకన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్, సాలోమన్, ఎఫ్ఏ విజయపుష్ప, సిటీఎం శ్రీదేవితో పాటు వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, రీజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు పాల్గొన్నారు.






