తెలంగాణలో భారీ సీవరేజ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్: 101 పట్టణాల కోసం నిధులు మంజూరు

by Naga Rani Yarlagadda |

తెలంగాణలో భారీ సీవరేజ్ ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణలో భారీ సీవరేజ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్: 101 పట్టణాల కోసం నిధులు మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం, మురుగునీటి నిర్వహణ సమస్యల్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. తెలంగాణలో 101 యూఎల్‌బీల్లో భారీ సీవరేజ్ ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఏకంగా రూ.3705.75 కోట్ల పరిపాలనా అనుమతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 (SBM 2.0) కింద సీవరేజ్ ప్రాజెక్టులకు టెండర్లకు అనుమతిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

ఈ ప్రాజెక్టులను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పద్ధతిని ఎంచుకుంది. మొత్తం 101 పట్టణాలను 3 వేర్వేరు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. దీనివల్ల పెద్ద కంపెనీలు పోటీ పడే అవకాశం లభిస్తుంది. సాధారణంగా భూసేకరణ పూర్తయ్యాక టెండర్లు పిలవాలి. కానీ.. ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఎక్కువగా ఉండటంతో.. కొన్నిచోట్ల భూసేకరణ ప్రక్రియ పెండింగ్ లో ఉన్నా.. టెండర్లను మాత్రం ఎక్కడా ఆపకుండా తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల కింద కేవలం డ్రైనేజీ నెట్వర్క్, ఎస్టీపీల నిర్మాణం మాత్రమే కాకుండా.. వాటిని నిర్మించిన సంస్థే ఐదేళ్లపాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది.

గతంలో ఈ ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 3,769.34 కోట్లుగా అంచనా వేయగా, ప్రభుత్వం దీనిని సమీక్షించి, సవరించి రూ.3,705.75 కోట్లకు కుదించి పరిపాలనా అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిధులు (SBM 2.0), రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల వినియోగానికి సంబంధించి నిధుల కొరత రాకుండా ఒక పక్కా ఆర్థిక ప్రణాళికను (Financial Structure) ఖరారు చేశారు. టెండర్లలో గరిష్టంగా బిడ్డర్లు పాల్గొనేలా ప్రోత్సహించడానికి, టెండర్ ప్రక్రియకు ముందే 'ప్రీ-బిడ్' సమావేశాలను విస్తృతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పట్టణాల్లో పారిశుధ్య ప్రమాణాలు పెరగడంతో పాటు, భూగర్భ జలాలు కలుషితం కాకుండా నివారించవచ్చు.

Next Story