- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం: పలు బీసీ కులాల పేర్లు మార్పు
తెలంగాణ ప్రభుత్వం బీసీ కులాల ఆత్మగౌరవాన్ని పెంచేలా కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల (BC) చిరకాల వాంఛను నెరవేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సమర్పించిన సిఫార్సుల మేరకు పలు కులాల పేర్లను మారుస్తూ, మరికొన్ని కులాలకు గౌరవప్రదమైన పర్యాయపదాలను జోడిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సామాజిక గౌరవాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం చేపట్టిన ఈ మార్పులు తక్షణమే అధికారిక రికార్డుల్లో అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితాలోని గ్రూప్-ఏ మరియు గ్రూప్-డి విభాగాల్లో ఈ మార్పులు చేపట్టింది.
గ్రూప్-ఏ విభాగంలో మార్పులు ఇలా..
ఈ క్రమంలో గ్రూప్-ఏ లోని వరుస సంఖ్య 7లో ఇప్పటి వరకు ఉన్న ‘దొమ్మర’ అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో ‘గడ వంశీయ’ అనే పేరును అధికారికంగా ఖరారు చేసింది. అలాగే, వరుస సంఖ్య 18లో ఉన్న ‘పిచ్చకుంట్ల’ అనే పదాన్ని మారుస్తూ, ఇకపై ఆ కులాన్ని ‘వంశ రాజ్’గా వ్యవహరించాలని నిర్ణయించింది. వరుస సంఖ్య 4లో ఉన్న బుడబుక్కల కులానికి ‘శివ క్షత్రియ’ అనే పదాన్ని పర్యాయపదంగా చేర్చడం ద్వారా, రికార్డుల్లో వీరిని ఇకపై ‘బుడబుక్కల, శివ క్షత్రియ’గా నమోదు చేయనున్నారు. అదేవిధంగా వరుస సంఖ్య 5లో ఉన్న ‘వన్నార్’అనే పదాన్ని తొలగించి, ఆ స్థానంలో ‘ధోబీ’ అనే పదాన్ని చేర్చడం ద్వారా మొత్తంగా వీరిని ‘రజక, చాకలి, ధోబీ’గా పేర్కొంటారు. వీటితో పాటు వరుస సంఖ్య 23లోని వీరభద్రియ కులానికి సంబంధించి, వారి అభ్యర్థన మేరకు ‘వీరముష్టి, నెట్టి కోటల’ అనే పదాలను పర్యాయపదాలుగా కలిపి గుర్తించనున్నారు.
గ్రూప్-డి విభాగంలో మార్పులు ఇలా..
బీసీ గ్రూప్-డి విభాగంలో కూడా ప్రభుత్వం పలు మార్పులు చేపట్టింది. ముఖ్యంగా వరుస సంఖ్య 29లో ఉన్న ‘శూద్ర కులం’ అనే పదాన్ని ప్రభుత్వం రికార్డుల నుంచి పూర్తిగా తొలగించి, దాని స్థానంలో ‘తమ్మలి (బ్రాహ్మణేతర)’గా పేరు మార్చింది. అలాగే వరుస సంఖ్య 5లో ఉన్న కులానికి ‘మేరు’ అనే పదాన్ని అదనంగా జోడించి, ఇకపై వీరిని ‘మేర, మేరు, చిప్పోలు’గా గుర్తించాలని నిర్ణయించింది. కులాల పేర్లలో అసభ్యకరంగా లేదా కించపరిచే విధంగా ఉన్న పదాలను తొలగించి, గౌరవప్రదమైన పేర్లను చేర్చాలని ఆయా వర్గాల నుంచి వచ్చిన విన్నపాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించింది. ఈ మార్పుల వల్ల విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ సామాజిక గుర్తింపును మరింత గౌరవప్రదంగా పొందే అవకాశం ఉంటుందని బీసీ కమిషన్ పేర్కొంది.






