నీటి కేటాయింపులపై తెలంగాణ సర్కార్ పట్టు.. 904 టీఎంసీలకు KWDT ఎదుట డిమాండ్

by Kema Shiva Kumar |

కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటాపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాదాన్ని తెరమీదకు తెచ్చింది.

నీటి కేటాయింపులపై తెలంగాణ సర్కార్ పట్టు.. 904 టీఎంసీలకు KWDT ఎదుట డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటాపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాదాన్ని తెరమీదకు తెచ్చింది. ఇప్పటి వరకు కోరినట్లు 511 టీఎంసీలు కాకుండా 904 టీఎంసీలు కావాలని వాదించనుంది. ఈ మేరకు రాష్ట్ర అవసరాలను కేడబ్ల్యూడీటీ ముందు వెల్లడించనుంది. ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి, అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. దీనిపై వారికి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టుల వారీగా లెక్కలు బయటికి తీశారు.

సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం

బచావత్‌ నేతృత్వంలో 1969లో కృష్ణా వాటర్‌ డిస్ప్యూట్‌ ట్రిబ్యునల్‌ -1 (కేడబ్ల్యూడీటీ -1) ఏర్పాటైంది. ఈ ట్రిబ్యునల్‌ 75% డిపెండబులిటీ ద్వారా మొత్తంగా కృష్ణాలో 2,060 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని, వాటి వినియోగం ద్వారా తిరిగి నదిలోకి 70 టీఎంసీల జలాలు వస్తాయని అంచనా వేసింది. మొత్తంగా కృష్ణాలో 2,130 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని అప్పటికే లెక్కలు తేల్చింది. వీటిల్లో మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్నాటకకు 734, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించింది. ఓవరాల్‌గా 330 టీఎంసీల మిగులు జలాలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఈ కేటాయింపులను 2000 సంవత్సరం తర్వాత సమీక్షించుకోవచ్చని మొత్తంగా 1976లో ట్రిబ్యునల్‌ -1 తన తుది తీర్పును వెలువరించింది. ఆ తర్వాత 2004లో జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలో కేడబ్ల్యూడీటీ -2 ఏర్పాటైంది. ఈ ట్రిబ్యునల్‌ 65% డిపెండబులిటీ కింద, సగటు ప్రవాహాల ఆధారంగా కృష్ణా నదిలో 2,578 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు తేల్చింది. అందులో ట్రిబ్యునల్‌-1 కేటాయించిన 2,130 టీఎంసీలను మినహాయించి.. మిగిలిన 448 టీఎంసీలను మూడు రాష్ర్టాలకు పంపిణీ చేసింది. వీటిలో మహారాష్ట్రకు 81 టీఎంసీలు, కర్నాటకకు 173, ఉమ్మడి ఏపీకి 194 టీఎంసీలు కేటాయించింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉమ్మడి ఏపీకి కేటాయించిన కృష్ణా జలాలను తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ చేయాలని నిర్ణయించారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేయాలని మార్గదర్శకాలు జారీ చేశారు. అప్పటి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల్లో నీటి యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ట్రిబ్యునల్ ముందు ఇరు రాష్ట్రాల వాదనలు నడుస్తుండడంతో సమస్య కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సమస్యను కొలిక్కి తీసుకొచ్చి ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంచాయితీకి పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్నది.

ప్రాజెక్టుల వారీగా లెక్కలు

ఇప్పటివరకు కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నుంచి 71% నీటి వాటా తెలంగాణకు కేటాయించాలని వాదనలు కొనసాగాయి. ఈ నెల 23 నుంచి 25 వరకు ఢిల్లీలో కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్​విచారణలో తెలంగాణ తరఫున తుది వాదనలు వినిపించాల్సి ఉన్నందున సీఎం శనివారం సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా మొత్తం కృష్ణా జలాల నుంచి 904 టీఎంసీలు రాష్ట్రానికి సాధించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు దీనికి సంబంధించిన లెక్కలు సైతం తీశారు.

రాష్ట్రం డిమాండ్ చేస్తున్న వాటా ఇలా..

పాత ప్రాజెక్టులకు - 303.54 టీఎంసీలు

నిర్మాణంలోని ప్రాజెక్టులకు - 287 .04 టీఎంసీలు

భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టులకు - 289.5 టీఎంసీలు

తాగునీటి అవసరాలకు - 15 టీఎంసీలు

పారిశ్రామిక అవసరాలకు - 9.29 టీఎంసీలు

Next Story