- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG floods: 1291 స్పాట్లు..రూ. 374 కోట్లు.. రాష్ట్రంలో వరదలకు భారీగా రోడ్ల విధ్వంసం
తెలంగాణలో వరత బీభత్సం భారీ నష్టాన్ని మిగిల్చింది.

దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : చరిత్రలో ఎన్నడూ లేనంతగా కురిసిన కుంభవృష్టి వర్షాలకు ఉత్తర తెలంగాణ వణికిపోయింది. కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్‌ను వరద (Telangana floods) ప్రవాహం ముంచెత్తింది. అనేక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ వరద విధ్వంసానికి పంట పొలాలు నీట మునిగాయి. అనేక చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క (Seethakka) ఈఎన్సీ ఎన్.అశోక్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దెబ్బతిన్న రహదారుల వివరాలపై ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా 1291 ప్రాంతాల్లో రహదారులు, కల్వర్టులు దెబ్బతిన్నట్లు అధికారులు మంత్రికి నివేదించారు. వీటి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.22.71 కోట్లు, శాశ్వత మరమ్మతుల కోసం రూ. 352 కోట్లు, మొత్తంగా గ్రామీణ రహదారుల పునరుద్ధరణ కోసం రూ.374.71 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తం 22 గ్రామాలకు రాకపోకలు దెబ్బతిన్నాయని, వాటిలో 14 గ్రామాలకు తాత్కాలికంగా రహదారులను పునరుద్ధరించినట్లు ఈఎన్సీ తెలిపారు. ప్రజా రవాణాను పునరుద్ధరణపై యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్న గ్రామాల్లో వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. వర్షాలకు తడిచి కూలే ప్రమాదం ఉన్న పంచాయతీరాజ్ భవనాలను తక్షణం ఖాళీ చేయించాలని, పంచాయతీరాజ్ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు వేగంగా చేపట్టాలని స్పష్టం చేశారు.
నేడు మరోసారి సీఎం రివ్యూ..
తాజా పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భారీ వర్షాలు, వరదలపై ఇవాళ మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. వరదల వల్ల ఆస్తి, పంట, ప్రాణ నష్టాలపై అధికారులతో చర్చించనున్నారు. వరద నష్టంపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా నష్టాన్ని అంచనా వేసి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఇవాళ వరద ప్రభావిత జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు.






