మున్సిపాలిటీల అభివృద్ధికి డిజిటల్ మాస్టర్ ప్లాన్

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేస్తోంది. అమృత్‌ 2.0లో భాగంగా జీఐఎస్‌ ఆధారిత ప్లాన్‌‌ను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మున్సిపాలిటీల అభివృద్ధికి డిజిటల్ మాస్టర్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్‌ 2.0లో భాగంగా జీఐఎస్‌ (జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌) ఆధారిత మాస్టర్‌ ప్లాన్‌‌ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ ఉండేలా డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) విభాగం కసరత్తు చేస్తున్నది. 20 పట్టణాలకు సంబంధించిన అన్ని రకాల సర్వేలు పూర్తిచేశారు. వీటికి జూన్ 2026 నాటికి జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) ఆధారిత మాస్టర్ ప్లాన్‌లను పూర్తి చేయాలని డీటీసీపీ నిర్ణయించింది. వీటితో పాటు రాష్ట్రంలోని మరో 50 నగరాలకు సైతం మాస్టర్ ప్లాన్స్ రూపొందించాలని సర్కారు డిసైడ్ అయింది. అయితే, మాస్టర్ ప్లాన్ అంశాలను ప్రతి మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని భావిస్తున్నది. స్థానిక ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు కూడా తీసుకుని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డీటీసీపీ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది.

మాస్టర్ ప్లాన్స్‌పై ఫోకస్

మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ ఎందుకు? అనే ప్రశ్న ప్రజల్లో తలెత్తింది. ముఖ్యంగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ అంశం సద్దుమణిగింది. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో గతంలో ఇష్టమొచ్చినట్టు నిర్మాణాలు చేపట్టేవారు. రోడ్లు, డ్రెయినేజీలు సైతం అస్తవ్యస్తంగా ఉంటున్నాయి. వీటిని ఒక క్రమబద్ధంగా ఏర్పాటు చేయడంతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా పట్టణాలను తయారు చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రతి మున్సిపాలిటీకి సంబంధించిన ఉపరితలం ఎత్తు, కుంటలు, చెరువులు, విస్తీర్ణం, మార్కెట్‌ యార్డులు, సెల్‌ టవర్లు, డ్రైనేజీ, రోడ్లు, ప్రధానమైన పంటలు, తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు, సర్వే నంబర్ల వారీగా ప్లాన్‌, కోల్డ్‌ స్టోరేజీలు, మార్కెట్ల వారీగా రవాణా సదుపాయాలు, వ్యవసాయ భూమి, ఇళ్లు, చెట్లు, వాటర్‌ ట్యాంకులు, రైల్వే, బస్‌స్టేషన్లు, సాగు, తాగునీటి వనరులను డ్రోన్‌ సర్వే ద్వారా మ్యాపింగ్‌ చేస్తున్నారు. మ్యాపింగ్‌ను, శాటిలైట్ ఇమేజ్‌ల ఆధారంగా భవిష్యత్ తరాల అవసరాలకు తగ్గట్టుగా తయారు చేయబోయే మాస్టర్‌ ప్లాన్‌కు ఈ డిజిటల్‌ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

కౌన్సిల్ సమావేశంలో..

గ్రేటర్ వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లు, నిజామాబాద్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి పట్టణాల మాస్టర్ ప్లాన్‌లను ప్రభుత్వం ఆమోదించింది. భూపాలపల్లి, దేవరకొండ, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, ఆందోల్, జోగిపేట్ ముసాయిదా మాస్టర్ ప్లాన్లను ప్రభుత్వ ఆమోదించాల్సి ఉన్నది. వీటితో పాటు మరో 20 పట్టణాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌లను డీటీసీపీ అధికారులు రెడీ చేస్తున్నారు. ఆర్మూర్, గద్వాల్, కోరుట్ల, మెదక్, తాండూరు, బాదేపల్లి, జనగాం, కొత్తగూడెం, మెట్‌పల్లి, వికారాబాద్, భైంసా, కాగజ్ నగర్, మంచిర్యాల, పాల్వంచ, వనపర్తి, బోధన్, కోదాడ, మందమర్రి, సిరిసిల్ల, జహీరాబాద్ పట్టణాలకు జూన్ నాటికి మాస్టర్ ప్లాన్ పూర్తికానుందని అధికారులు చెబుతున్నారు. అధికారులు రెడీ చేసిన ముసాయిదా మాస్టర్ ప్లాన్లను మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో చర్చించడంతో పాటు ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి పట్టణానికి చెందిన మాస్టర్ ప్లాన్‌ను కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా మరో 50 పట్టణాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌లను సైతం కౌన్సిల్ సమావేశాల్లో చర్చించాల్సిందేనని సీఎం రేవంత్ స్పష్టంచేసినట్టు అధికారులు చెబుతున్నారు.

Next Story