TG: కేబినెట్ సబ్‌కమిటీ ఆమోదం.. ఈనెల 20న నోటిఫికేషన్

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-07 16:56:57  IST  )

అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా పలు ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలను, ఫ్లాట్లను బహిరంగ వేలం వేయనున్నారు.

TG: కేబినెట్ సబ్‌కమిటీ ఆమోదం.. ఈనెల 20న నోటిఫికేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా పలు ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలను, ఫ్లాట్లను బహిరంగ వేలం వేయనున్నారు. ఇందుకు సంబంధించి గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి డా.జ్యోతిబుద్ధ ప్రకాశ్, హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతం సిద్ధం చేసిన ప్రతిపాదనలకు వనరుల సమీకరణలపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఈ నెల 20వ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పలు జిల్లాలలోని 11 ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయిన, పాక్షికంగా పూర్తయిన అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లతోపాటు, ఓపెన్ ప్లాట్లు, హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలోని నాలుగు ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లు, ఖాళీ స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఎటువంటి వివాదాలు లేని భూములు, అందుబాటులో ఉండే ధరలతో నిర్మించిన అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లను కొనుగోలు చేసుకునేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గృహనిర్మాణ సంస్థ కమిషనర్ గౌతం సూచించారు. రాజీవ్ స్వగృహకు సంబంధించి గాజుల రామారం, పోచారం, ఖమ్మం పోలేపల్లి ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న టవర్లలో (ఒక్కో దానిలో సుమారు 100 నుంచి 150 వరకు ఫ్లాట్లు ఉన్న టవర్‌ను యూనిట్‌గా) ఏక మొత్తంగా విక్రయించనున్నారు. బిల్డర్లు, ఒక గ్రూప్‌గా ఏర్పడి కొనుగోలు చేయాలనుకున్న వారితోపాటు, హౌసింగ్ కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు, బహుళ అంతస్తుల భవనాల అవసరం ఉన్న సంస్థల, వంటి వారు తీసుకునేందుకు వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాజీవ్ స్వగృహకు సంబంధించి..

- రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 514, కుర్మల్‌గూడలో 20, చందానగర్‌లోని 3 ఓపెన్ ఫ్లాట్లు, బండ్లగూడలో 159 పూర్తయిన ఫ్లాట్లు, మేడ్చల్-మల్కాజ్‌గిరి గాజులరామారంలోని 5 టవర్లలోని పూర్తికాని కట్టడాలు, పోచారంలో పూర్తయిన 601 ఫ్లాట్లు, అసంపూర్తిగా 6 టవర్లలోని వివిధ రకాల ఫ్లాట్లు, బహదూర్‌పల్లిలోని 69 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి.

- మహబూబ్‌నగర్ జిల్లాలోని పోతులమడుగులో111, అమిస్తపూర్‌లోని 45 ఓపెన్ ప్లాట్లను విక్రయించడానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అలాగే.. ఖమ్మం జిల్లాలో పోలేపల్లిలో అసంపూర్తిగా ఉన్న 8 టవర్లతోపాటు, 3.38 ఎకరాల ఖాళీ స్థలాన్ని కూడా బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు.

హౌసింగ్ బోర్డు స్థలాలు..

- కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ (కేపీహెచ్‌బీ)- 4వ ఫేజ్‌లో 7 ఎకరాల 33 గుంటల విస్తీర్ణంలో ఉన్న ఖాళీ భూములను, అదే కాలనీలో ఉన్న రెండు ఓపెన్ ప్లాట్లును (4,598 చదరపు గజాల విస్తీర్ణం, 2,420 చదరపు గజాల విస్తీర్ణం) ఈ-ఆక్షన్ ద్వారా విక్రయించనున్నారు. అలాగే నాంపల్లిలోని 1,148 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఖాళీ స్థలాన్ని, సంజీవరెడ్డినగర్‌లో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీహాల్‌కు చెందిన 2,605 చదరపు గజాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

- సంజీవరెడ్డినగర్‌లోని కమ్యూనిటీహాల్ (సెల్లార్, స్టిల్ట్, జి+1) 22,285 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 37,070 చదరపు అడుగుల పార్కింగ్ స్థలంతో పూర్తయ్యే స్థితిలో ఉన్నది. ఈ భూములను ఫంక్షన్ హాల్ నిర్వహణ కోసం వేలం వేయనున్నారు.

Next Story