చదువు పూర్తికాగానే చేతిలో ఉద్యోగం: తెలంగాణ సర్కార్ భారీ స్కెచ్!

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలను చేరువ చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి నడుం బిగించింది.

చదువు పూర్తికాగానే చేతిలో ఉద్యోగం: తెలంగాణ సర్కార్ భారీ స్కెచ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలను చేరువ చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి నడుం బిగించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) విద్యార్థుల కోసం 39 నూతన జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు టీజీసీహెచ్ఈ ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి ప్రకటించారు. మంగళవారం టీశాట్ ద్వారా నిర్వహించిన ప్రత్యక్ష ప్రసార అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్ 2047లో భాగంగా, నిరుద్యోగితను రూపుమాపడమే ధ్యేయంగా ఈ కోర్సులను రూపొందించినట్లు ఛైర్మన్ తెలిపారు. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ (పీపీపీ) ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం అని పేర్కొన్నారు. ముఖ్యంగా మ్యారిటైమ్ రంగంలోనే రూ 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నూతన విద్యా విధానం ద్వారా సుమారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్, మ్యారిటైమ్, ఫిన్‌టెక్, క్లైమేట్ సైన్స్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ టెక్నాలజీ వంటి రంగాలకు ప్రాధాన్యతనిచ్చారు. జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌ను ఫార్మా, ఏరోస్పేస్ మరియు లైఫ్ సైన్సెస్ హబ్‌గా అభివృద్ధి చేయడంలో ఈ కోర్సులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీ-అకాడమియా అనుసంధానానికి ప్రాధాన్యత ఇస్తూ, వివిధ పరిశ్రమలతో ఎంఓయులు కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు ప్రాక్టికల్ లెర్నింగ్, ఇంటర్న్‌షిప్‌లు, ఫీల్డ్ వర్క్, ఇండస్ట్రీ ప్రాజెక్ట్‌లను తప్పనిసరిగా అమలు చేసి, వాటికి క్రెడిట్ సిస్టమ్‌ను అనుసంధానం చేయనున్నారు.

ఏఐ ట్యూటర్లతో 24/7 అకాడమిక్ సపోర్ట్..

సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భాగంగా ఐఐటి మద్రాస్ సహకారంతో ఏఐ ట్యూటర్లను ప్రవేశపెడుతున్నారు. ఇవి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ (ద్విభాషా)లో సందేహాలను నివృత్తి చేస్తాయి. డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్స్ ద్వారా విద్యార్థులు ఎప్పుడైనా, ఎక్కడైనా చదువుకునే వెసులుబాటు కలుగుతుంది.

ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అండ్ క్రెడిట్ సిస్టమ్..

ఫ్లెక్సిబుల్ అకాడమిక్ పాత్‌వేస్ ద్వారా ఒక సంవత్సరం పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్, రెండు సంవత్సరాలకు డిప్లొమా, మూడు సంవత్సరాలకు డిగ్రీ, నాలుగు సంవత్సరాలకు ఆనర్స్ డిగ్రీ అందించే విధానం అమలు చేయబడుతోంది. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ) ద్వారా విద్యార్థులు తమ క్రెడిట్లను భద్రపరుచుకుని, అవసరమైనప్పుడు చదువును కొనసాగించే అవకాశం కల్పించబడుతుంది. గ్రామీణ విద్యార్థుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ల్యాండ్ అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ వంటి ప్రత్యేక కోర్సులను కూడా ప్రవేశపెడుతున్నారు. అలాగే పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు క్లైమేట్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నూతన కోర్సుల అమలుకు సంబంధించి వచ్చే నాలుగు నెలల్లో స్టేక్ హోల్డర్స్ నుండి సూచనలు సేకరించి, జూన్-జూలై 2026 నాటికి సిలబస్ రూపకల్పన, ఫ్యాకల్టీ ట్రైనింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ ఇ. పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్.కె. మహ్మూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ పాల్గొన్నారు. సామాజిక శాస్త్రాలు, సైన్స్, మల్టీడిసిప్లినరీ కోర్సుల ప్రాముఖ్యతపై వారు వివరణ ఇచ్చారు.

Next Story